కాంతి నింపిన సంక్రాంతి

Huge Sankranti Festival Celebrations Completed In Andhra Pradesh - Sakshi

ఊరూవాడా ఉత్సాహం..

వీధివీధినా సంబరం

పులకించిన యువత కేరింత

ఎల్లెడలా ఎగసిన క్రీడాస్ఫూర్తి

భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/నెట్‌వర్క్‌: ఏ వీధి చూసినా రంగులద్దిన రంగవల్లులు.. వాటిపై గొబ్బెమ్మలు.. ప్రతి ఇంటి నుంచి కమ్మటి పిండివంటల వాసనలు.. యువతీయువకుల కేరింతలు.. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేస్తూ గోపూజలు.. కోడిపందేలు, ఎడ్లపందేలు.. గాలిపటాలు.. క్రీడాపోటీలు.. ముగ్గుల పోటీలు.. రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా మూడురోజులు కనిపించిన దృశ్యాలివి. భోగి రోజైన శుక్రవారం మొదలైన కోడి పందాల జాతర కనుమ రోజైన ఆదివారం సా.5 గంటలతో పరిసమాప్తమైంది. బరుల వద్ద ఏకంగా బౌన్సర్లను రంగంలోకి దించారు. భీమడోలు మండలం గుండుగొలనులో పేకాట శిబిరం వద్దకు మఫ్టీలో వెళ్లిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై పేకాట రాయుళ్లు దాడి చేయడంతో వారిపై కేసు నమోదు చేశారు.

ఇక తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని పల్లంకుర్రులో నిర్వహించిన భారీ కోడి పందేల్లో ఇన్నోవా కారును బహుమతిగా పెట్టడం విశేషం. ‘పశ్చిమ’ంలోని కాళ్ల మండలం సీసలిలో నిర్వాహకులు రెండు బుల్లెట్లు సిద్ధంచేశారు. అలాగే, కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పాల రాంప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంప్రదాయ కోడి పందేల్లో గెలుపొందిన విజేతలకు బులెట్, స్కూటీలను బహుమతులుగా అందజేశారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దలను స్మరించుకుని వారికి పిండివంటలు నివేదించారు. విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో బొజ్జన్నకొండ వద్ద కనుమ సందర్భంగా జాతర కోలాహలంగా జరిగింది. ఇక్కడి బౌద్ధస్థూపం వద్ద జరిగిన బౌద్ధమేళాలో మయన్మార్‌ బౌద్ధ భిక్షువు వెనరబుల్‌ ఆయుపాల మహాథేరోజీ పాల్గొన్నారు. సింహాచలంపై మకరవేట ఉత్సవాన్ని నిర్వహించారు. విశాఖలో గాలిపటాలు ఎగురవేశారు.  

ఆలయాల్లో ఘనంగా గోపూజలు
కనుమ పండుగ సందర్భంగా దేవదాయశాఖ రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలన్నింటిలోనూ ఆదివారం గోపూజ కార్యక్రమాలు నిర్వహించింది. దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ సతీ సమేతంగా విజయవాడ దుర్గగుడిలో గోపూజ చేశారు. అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయంలో జరిగిన గోపూజలో ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తిరుపతి ఇస్కాన్‌ మందిరం వేదికగా సిద్ధరామేశ్వర, రాజరాజేశ్వరి ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గోమాతలకు సీమంతాలు, గోదూడలకు నామకరణ ఉత్సవం నిర్వహించారు. 

గుడివాడలో జాతీయ ఎడ్ల పందేలు
మంత్రి కొడాలి నాని సారథ్యంలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలోని లింగవరం రోడ్డులో జాతీయ స్థాయి ఎడ్ల పందేలు నిర్వహించారు.

రసవత్తరంగా పందుల పందేలు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లిలో మూడురోజుల పాటు పందుల పందేలు రసవత్తరంగా సాగాయి. 

పితృదేవతల స్మరణ
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సింహపురీయులు శనివారం పితృదేవతలను స్మరిస్తూ నెల్లూరులోని పవిత్ర పినాకిని తీరంలో ఉన్న సమాధుల తోట (బోడిగాడితోట)లో తమ పూర్వీకుల సమాధుల వద్ద పూజలు చేశారు. 

బహుమతులందజేసిన ఎమ్మెల్యే రోజా
వైఎస్సార్‌ జిల్లా శెటిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.

సందడిలేని అతిథులు
సంక్రాంతి కోడి పందేలను.. ఇక్కడి వారి ఆత్మీయ విందును రుచిచూసి మళ్లీ ఏడాది వరకు ఎదురుచూసే అతిథులు ఈసారి పెద్దగా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. 

అంబరాన్నంటిన ప్రభల సంబరం
అమలాపురం: సంక్రాంతి పండగ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ వ్యాప్తంగా ప్రభల తీర్థాలు వైభవంగా జరిగాయి. జిల్లాలో సంక్రాంతి నుంచి ముక్కనుమ వరకూ ప్రభల తీర్థాలు జరుగుతాయి. గత ఏడాది స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ మెప్పు పొందిన అంబాజీపేట మండలం జగ్గన్నతోట ప్రభల తీర్థం ఆదివారం నయనానందకరంగా సాగింది. ఏకాదశ రుద్రులను (11 ప్రభలను) పంటపొలాలు, కాలువలు దాటుతూ తరలించిన తీరు భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ముఖ్యంగా గంగలకుర్రు, గంగలకుర్రు అగ్రహారం ప్రభలు అప్పర్‌ కౌశిక కాలువను దాటి వచ్చే అపురూప దృశ్యాన్ని పెద్దసంఖ్యలో భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మొత్తం 11 ప్రభలు జగ్గన్నతోటలో ఒకేచోట కొలువుదీరి భక్తులను పరవశింపజేశాయి. అంబాజీపేట మండలంలో వాకలగరువు సరిహద్దున జరిగిన తీర్థాల్లో వాకలగరువు ప్రభ 47 అడుగులు, తొండవరం ప్రభ 46 అడుగుల ఎత్తున రూపుదిద్దుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 60 గ్రామాల్లో ప్రభల తీర్థాలు కనులపండువగా జరిగాయి.
జగ్గన్నతోట ప్రభల తీర్థానికి అప్పర్‌ కౌశిక కాలువను దాటి వస్తున్న గంగలకుర్రు అగ్రహారం ప్రభ 

రంగంపేటలో ఉత్సాహంగా జల్లికట్టు
చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట గ్రామంలో నిర్వహించిన పశువుల పండుగ వేడుక అంబరాన్నటింది. పశువుల యజమానులు వాటి కొమ్ములకు పలకలను కట్టి పందేలకు సిద్ధం చేశారు. జిల్లాలోనే ఎడ్ల పందేలు (జల్లికట్టు)కు అత్యంత ప్రాధాన్యత ఉన్న గ్రామం రంగంపేట. జల్లికట్టును చూడటానికి జిల్లా నలుమూలల నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పౌరుషంతో పరుగులు తీస్తున్న కోడెగిత్తలను నిలువరించేందుకు యువకులు ఉత్సాహం చూపారు. ఎద్దులకు కట్టిన పలకలను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top