
దరఖాస్తుకు ముగిసిన గడువు
అసంబద్ధ నిబంధనతో అవకాశం కోల్పోయిన 3 లక్షల మంది!
దాదాపు 20వేల మంది ‘సీబీఎస్‌ఈ’ అభ్యర్థులకు అన్యాయం
అర్హులపై నిర్దయగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకాల కోసం విడుదల చేసిన డీఎస్సీ–2025కి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. రాత్రి 8 గంటల వరకు 3,53,598 మంది అభ్యర్థులు 5,67,067 దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అర్ధరాత్రి గడువు ముగిసే సమయానికి మరో 20వేల వరకు దరఖాస్తులు అందవచ్చని అంచనా. కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ–2025 పేరుతో 16,347 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఏప్రిల్ 20 నుంచి దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించింది.
నోటిఫికేషన్‌లో ఊహించని కఠిన నిబంధనలు విధించింది. దీంతో దాదాపు 7లక్షల మందికి పైగా అభ్యర్థులు అనర్హులయ్యారు. ఈ కఠిన నిబంధనలతో అనుకున్న స్థాయిలో దరఖాస్తులు వచ్చే అవకాశం లేదని గుర్తించిన విద్యాశాఖ... రిజర్వుడు అభ్యర్థుల అర్హత మార్కులను 40శాతానికి తగ్గించి, టెట్‌లో వీరికి ఇచ్చిన నిబంధనల మేరకు డీఎస్సీకి అర్హత మార్కులు తగ్గించినట్టు ప్రకటించింది.
అయితే, ఇదే టెట్‌లో జనరల్ అభ్యర్థులకు 45శాతం మార్కుల నిబంధన ఉన్నా పట్టించుకోకుండా, సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ గెజిట్‌కు విరుద్ధంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. దీంతో దాదాపు 3 లక్షల మంది డీఈడీ, బీఈడీ చేసిన జనరల్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు.
సీబీఎస్‌ఈ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం
పదో తరగతి వరకు సీబీఎస్‌ఈలో చదివి, డీఈడీ, టెట్ పూర్తి చేసినవారికీ కూటమి ప్రభుత్వం డీఎస్సీలో అన్యాయం చేసింది. సీబీఎస్‌ఈ విద్యార్థులకు పదో తరగతిలో మొదటి భాష ఇంగ్లిష్ ఉంటుంది. రెండో భాషగా తెలుగు/హిందీ/ఉర్దూ తదితర భాషలు ఎంచుకుంటారు. అయితే, మొదటి భాషగా తెలుగు ఉంటేనే ఎస్‌జీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకునేలా నిబంధన పెట్టడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు నష్టపోయారు.
2024 ఫిబ్రవరిలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఈ మీడియం నిబంధన లేకపోవడంతో సీబీఎస్‌ఈ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వారు చెల్లించిన ఫీజు సైతం తిరిగి ఇవ్వకుండా మెగా డీఎస్సీ–2025కి వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. అయితే, మొదటి లాంగ్వేజ్‌గా తెలుగు కచ్చితమనే నిబంధన పెట్టడంతో 15వేల నుంచి 20వేల మంది అర్హులైన అభ్యర్థులు అనర్హులుగా మారారు.