AP: రూపాయికే ఇల్లు ప్రభుత్వం ఘనత

A House for One Rupee Is Credit Of The AP Govt Adimulapu Suresh - Sakshi

భీమవరం (ప్రకాశంచౌక్‌)/పాలకొల్లు అర్బన్‌(ప.గో. జిల్లా): దేశంలోనే ఒక్క రూపాయికి 300 చదరపు అడుగుల ఇల్లు ను ఉచితంగా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. పాలకొల్లు సమీపంలోని పెంకుళ్లపాడులో సుమారు 54 ఎకరాల్లో తొలి విడత నిర్మించిన 1,856 టిడ్కో గృహాలను, భీమవరం పట్టణం గునుపూడిలో 82 ఎకరాల్లో నిర్మించిన 1,920 టిడ్కో గృహాలను శుక్రవారం ఆయన లబ్ధిదారులకు అందజేశారు. పాలకొల్లులో జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి కవురు శ్రీనివాస్‌ అధ్యక్షతన, భీమవరంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ అధ్యక్షతన ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపడుచులకు సారె రూపంలో టిడ్కో ఇళ్లు అందిస్తున్నామని, జగనన్ననగర్‌ పేరుతో వీటిని నిర్మిస్తూ సొంతింటి కల సాకారం చేస్తున్నామన్నారు.

టిడ్కో ఇళ్లను దశల వారీగా లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టా మన్నారు. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు టిడ్కో ఇళ్లపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. నాడు 300 చదరపు అడుగుల ఇల్లుకు రూ.2.50 లక్షల బ్యాంకు రుణం కట్టాలని టీడీపీ వారు చెప్పారా లేదా అనిప్రశ్నించారు. ఈ మేరకు పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలంటే సాధ్యమా అన్నారు. సీఎం జగన్‌ నేతృత్వంలో పేదలపై భారం తగ్గించేలా రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయించి 300 చదరపు అడుగుల ఫ్లాట్‌ను పూర్తి ఉచితంగా అందిస్తున్నామన్నారు. జగనన్నకు మీ అందరి అశీస్సులు ఉండాలని ఆయన కోరారు.  

భీమవరంలో నాడు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ 82 ఎకరాల భూమిని ఒకేచోట సేకరించడం వల్ల ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యిందన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్‌ విప్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే నిమ్మ ల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహ న్, టిడ్కో చైర్మన్‌ జె.ప్రసన్నకుమార్, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వేండ్ర వెంకటస్వామి, కార్పొరేషన్‌ చైర్మన్‌లు పెండ్ర వీరన్న, గుబ్బల తమ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, జెడ్పీటీసీలు కాండ్రేగుల నర్సింహరావు, నడపన గోవిందరాజులనాయుడు, గుంటూరు పెద్దిరాజు, ఎంపీపీలు రావూరి వెంకటరమణ, సబ్బితి సు మంగళి, పేరిచర్ల విజయనర్సింహరాజు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, ఎస్సీ కమిషన్‌ మెంబర్‌ చెల్లెం ఆనందప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.  

ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం 
నా భర్త శ్రీనివాస్‌ వడ్రంగి పని, నేను కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. నాకు రూపాయి రిజిస్ట్రేషన్‌తో ఏ–59 బ్లాక్‌లో ఫ్లాట్‌ వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2.15 లక్షల బ్యాంక్‌ రుణం కట్టాలన్నారు. నెలకి రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కడుతూ మొత్తంగా రూ.7 లక్షల వరకు చెల్లించాలన్నారు. సీఎం జగన్‌ నా కుటుంబానికి ఉచితంగా టిడ్కో ఇల్లు ఇచ్చారు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాం.     
– కీర జ్యోతి, లబ్ధిదారు, పాలకొల్లు

సొంతింటి కల నెరవేరింది 
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నా సొంతింటి కల నెరవేర్చారు. సుమారు 30 ఏళ్లపాటు అద్దె ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్న నాకు ఈ రోజు సొంతిల్లు రావడంతో కొండంత ధైర్యం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేవలం రూపాయికే నాకు ఇంటిని ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేసి అందించడం చాలా సంతోషంగా ఉంది. పండగ పూట మా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మంత్రుల చేతులమీదుగా ఇళ్ల పట్టా అందుకోవడం ఆనందంగా ఉంది.  
– కె.దానమ్మ, లబ్ధిదారు, భీమవరం

సొంతింటి కల సాకారం
మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు 

శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు మాట్లాడుతూ భీమవరంలో తొలి విడతగా 1,920 మందికి ఇళ్లను అందించడం, పట్టణంలోని పలు ప్రాంతాల్లో 180 ఎకరాలు సేకరించి వేల మందికి ఇంటి పట్టాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఇవ్వడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూనే పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారన్నారు.  

రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కే దక్కుతుందన్నారు. బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారులకే సంక్షేమ పథకాల లబ్ధిని అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం పండగ రోజున టిడ్కో ఇళ్లను అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దివంగత వైఎస్సార్‌ సాయంతో పట్టణంలో 82 ఎకరాల భూమిని అప్పట్లో సేకరించామన్నారు. కలెక్టర్‌ పి.ప్రశాంతి మాట్లాడుతూ భీమవరంలో మిగిలిన టిడ్కో ఇళ్లను రెండు, మూడు నెలల్లో అందజేస్తామన్నారు. ఇక్కడ 512 మందికి ఒక్క రూపాయికే ఇళ్లు ఇచ్చామన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top