కృష్ణా, తుంగభద్ర పోటాపోటీ | Hourly rising flood into Srisailam project | Sakshi
Sakshi News home page

కృష్ణా, తుంగభద్ర పోటాపోటీ

Jul 28 2024 5:40 AM | Updated on Jul 28 2024 1:07 PM

Hourly rising flood into Srisailam project

శ్రీశైలం ప్రాజెక్టులోకి గంట గంటకూ పెరుగుతున్న వరద  

నాగార్జునసాగర్‌కు 52,599 క్యూసెక్కుల ప్రవాహం.. 127.97 టీఎంసీలకు చేరిన నిల్వ 

తుంగభద్ర డ్యామ్‌ నుంచి 1.58 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల 

నేడు శ్రీశైలానికి మరింత వరద పెరిగే అవకాశం 

సాక్షి, అమరావతి/హొసపేటె/శ్రీశైలం ప్రాజెక్ట్‌:  కృష్ణా, ప్రధాన ఉప నది తుంగభద్ర పోటాపోటీగా వరదెత్తుతున్నాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు జూరాల నుంచి 3.12 లక్షల క్యూసె­క్కుల కృష్ణా జలాలు.. సుంకేశుల నుంచి 99,736 క్యూసెక్కుల తుంగభద్ర జలాలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,12,280 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 866.4 అడుగుల్లో 127.59 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి కేంద్రంలో ఏజీ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 18,480 క్యూసెక్కులు.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు వదులుతోంది. 

కృష్ణా, తుంగభద్రల నుంచి భారీ వరద వస్తుండటంతో సోమ లేదా మంగళవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తేయను­న్నారు. నాగార్జునసాగర్‌లోకి 52,599 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 507.80 అడుగుల్లో 127.97 టీఎంసీలకు చేరు­కుంది. కృష్ణా ప్రధా­న పాయలో ఉధృతి మరింత పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌లలోకి వచి్చన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్రలో ఉధృతి మరింత పెరిగింది. డ్యామ్‌లోకి 1.21 లక్షల క్యూసె­క్కులు చేరుతుండటంతో.. మొత్తం 33 గేట్లు ఎత్తేసి, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు 1.58 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. 

దాంతో మంత్రాలయం వద్ద తుంగభద్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వరద మట్టం 311.25 మీటర్లు(సముద్రమట్టానికి)కు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సుంకే­శుల బ్యారేజ్‌లోకి 1,02,100 క్యూసెక్కులు చేరుతుండగా.. కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులు వదులుతూ గేట్లు ఎత్తి దిగువకు 99,736 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. దీంతో ఆది­వారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. 

Advertisement
 
Advertisement
Advertisement