
సంక్షేమ పథకాల తీరుతెన్నులను తెలుసుకుంటున్న హిమాచల్‌ప్రదేశ్ సీఎస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులను హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్సుభాగ్ సింగ్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి పథకాల అధ్యయనానికి వచ్చిన ఆయనకు సోమవారం హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్‌అఫీఫియో కార్యదర్శి, కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. దాదాపు మూడు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు–నేడు, విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ రైతన్నలకు అన్ని సేవలు అందిస్తున్న వైఎస్సార్ రైతుభరోసా కేంద్రాలు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో ఏర్పాటైన వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రజలకు అన్ని సేవలు ఒకేచోట అందించేందుకు ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాల సేవలపై రామ్‌సుభాగ్ సింగ్ ప్రత్యేక ఆసక్తి చూపించారు.
తమ రాష్ట్రంలో ఈ కార్యక్రమాల అమలుకు కృషిచేస్తామని, వివిధ రాష్ట్రాలు అమలుచేస్తున్న అత్యుత్తమ పథకాలను తమ రాష్ట్రంలో అమలుచేసేందుకు ఆయా రాష్ట్రాల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను విజయ్‌కుమారెడ్డి ఆయనకు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.