ఆహారభద్రత కమిషనర్‌కు ఆ అధికారం లేదు

High Court Says Chewable Tobacco Products Cannot Be Banned By Invoking Fss Act AP - Sakshi

పొగాకు, పొగాకు ఉత్పత్తులు ఆహార నిర్వచనం పరిధిలోకి రావు 

వాటిని నిషేధించే అధికారం, పరిధి ఆహారభద్రత కమిషనర్‌కు లేవు

అందువల్ల కమిషనర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టేస్తున్నాం

హైకోర్టు ధర్మాసనం తీర్పు

సాక్షి, అమరావతి: ఆహారభద్రత, ప్రమాణాల చట్టం (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ) కింద గుట్కా, పాన్‌­మసాలా తదితర పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయం, సరఫరా, పంపిణీ తదితరా­లను నిషేధించే అధికారం ఆహారభద్రత కమి­ష­నర్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. పొగాకు, పొగాకు ఉత్పత్తులు ‘ఆహారం’ నిర్వ­చన పరిధిలోకి రావని చెప్పింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ కింద పొగాకు ఉత్పత్తుల తయారీ, అమ్మకాలు తదితరాలను నియంత్రించే అధికారం మాత్రమే కమిషనర్‌కు ఉందని, నిషేధం విధించే అధికారం లేదని తెలిపింది. కమిషనర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డి.వి.ఎస్‌.ఎస్‌.సోమయాజుల ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పొగాకు ఉత్పత్తులు కేంద్రప్రభుత్వ చట్టపరిధిలోకి వస్తాయని, అందువల్ల ఆహారభద్రత కమిషనర్‌ జారీచేసిన నోటిఫికేషన్‌ చట్టవిరుద్ధమంటూ పలువురు వ్యాపారులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పొగాకు, పాన్‌మసాలా, గుట్కా తదితర పొగాకు ఆధార ఉత్పత్తుల సేవనం ఆహార నిర్వచన పరిధిలోకి వస్తుందా? రాదా? అన్న అంశాన్ని సింగిల్‌ జడ్జి ధర్మాసనానికి నివేదించారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై సీజే ధర్మాసనం విచారించి తీర్పు చెప్పింది. పిటిషనర్ల రోజువారీ చట్టబద్ధ కార్యకలాపాల్లో ఏ రకంగాను జోక్యం చేసుకోవద్దని, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ కింద జప్తుచేసిన సరుకును తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. లైసెన్స్‌ తీసుకుని వ్యాపారం చేసేవారిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ కింద ఎలాంటి కఠినచర్యలు తీసుకోవద్దని పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top