తప్పుడు కేసా.. కాదా అన్నది మేము తేలుస్తాం | High Court makes strong comments in the case against senior IPS officer PSR | Sakshi
Sakshi News home page

తప్పుడు కేసా.. కాదా అన్నది మేము తేలుస్తాం

May 30 2025 2:45 AM | Updated on May 30 2025 5:35 AM

High Court makes strong comments in the case against senior IPS officer PSR

ఆ విషయం చెప్పాల్సింది పోలీసులు, ప్రభుత్వం కాదు  

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌పై కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు 

జత్వానీపై పెట్టింది తప్పుడు కేసు అని ఎలా చెబుతారు? 

ఎవరు అమాయకులో.. ఎవరు కాదో కూడా చెప్పాల్సింది కోర్టులే 

పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయడమే 

ప్రతి నిందితుడూ తనపై పెట్టింది తప్పుడు కేసేనంటారు 

కేసు పెట్టిన పోలీసులపైనే తిరిగి కేసు పెడితే దానికి అంతుండదు 

ఇది ప్రమాదకరం.. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం 

ఎవరినో సంతృప్తి పరిచేందుకు ఇలాంటి కేసు పెట్టడం సరికాదు 

వందల మంది సాక్షులను విచారించేందుకు ఇదేమైనా రాజీవ్‌ హత్య కేసా? 

బెయిల్‌ మంజూరుకు పీఎస్సార్‌కు కఠిన షరతులు విధిస్తాం  

సాక్షి, అమరావతి:   సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నంలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుపై నమోదు చేసిన కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. జత్వానీపై వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు తప్పుడు కేసని పోలీసులు చెప్పడంపై మండిపడింది. అది తప్పుడు కేసా.. కాదా.. అన్నది చెప్పాల్సింది సంబంధిత కోర్టే తప్ప.. పోలీసులు, ప్రభుత్వం కాదని తేల్చి చెప్పింది. ఎవరు అమాయకులు.. ఎవరు అమాయకులు కాదన్న సంగతి తేలుస్తామంది.

పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయడం వరకేనని స్పష్టం చేసింది. ఓ నిందితుడిపై పోలీసులు కేసు పెట్టినందుకు, తిరిగి ఆ పోలీసులపైనే కేసు పెడితే, ఇక దానికి అంతు అంటూ ఉండదని వ్యాఖ్యానించింది. ఇదో ప్రమాదకర తీరుగా మారుతుందని తెలిపింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంది. 

వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది. ఎవరినో సంతృప్తి పరచడానికి ఇలా కేసులు పెట్టడం ఎంత మాత్రం సరికాదంది. వందల సంఖ్యలో సాక్షులను విచారించడానికి ఇదేమైనా రాజీవ్‌ గాంధీ హత్య కేసా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ దశలో తమ ముందుంచే సాక్ష్యాలకు ఎలాంటి విలువాలేదంది.

బెయిల్‌ మంజూరుకు పీఎస్సార్‌ పిటిషన్‌
జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ పీఎస్సార్‌ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం మరోమారు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఎదుట ఆంజనేయులు తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నగేష్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో 60 మంది సాక్షులను విచారించారన్నారు. 

పలువురు పోలీసులకు ఇదే కోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందన్నారు. అలాగే తదుపరి చర్యలను కూడా నిలుపుదల చేసిందని వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసి­క్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ తీవ్ర స్వరంతో స్పందిస్తూ, జత్వానీపై పెట్టిన కేసు తప్పుడు కేసని తెలిపారు. కేసు నమోదు చేయడానికి ముందే ఆంజనేయులు ఆదేశాల మేరకు జత్వానీ కోసం పలువు­రు పోలీసు అధికారులు ముంబయి వెళ్లారన్నారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. 

ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, పోలీసుల తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రతి నిందితుడు కూడా తమపై పెట్టింది తప్పుడు కేసేనంటూ, కేసు పెట్టిన పోలీసులపైనే కేసు పెట్టడం మొదలు పెడతారన్నారు. ఇలాంటి వాటికి అనుమతిస్తే పర్యవసానాలు ఊహకు కూడా అందవన్నారు. ఈ సమయంలో పీపీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ, కేసు దర్యాప్తులో ఉండగానే దర్యాప్తు అధికారులను ఆంజనేయులు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నారు. 

ఇప్పుడు బయటకు వస్తే కచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారని, దీని ప్రభావం కేసుపై పడుతుందని తెలిపారు. దీనిపై న్యాయ­మూర్తి స్పందిస్తూ పీఎస్సార్‌ ఆంజనేయులుకు బెయిల్‌ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తానన్నారు. ఇందుకు సంబంధించి సవివరంగా ఉత్తర్వులు కూడా ఇస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement