
సింగిల్ జడ్జి ఉత్తర్వులు రద్దు చేసిన హైకోర్టు
జీవో 446 విషయంలో యథాతథ స్థితి కొనసాగించండి
ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపండి
పిటిషనర్‌కు వాదనలు వినిపించుకునే అవకాశం ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం
సాక్షి, అమరావతి: కడప మేయర్ కె.సురేష్ బాబుకు హైకోర్టు ఊరటనిచ్చింది. మేయర్ పదవి నుంచి తప్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. ఆ ఉత్తర్వులు ఇంకా అమల్లోకి రాని నేపథ్యంలో స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తనను మేయర్ పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14న జారీ చేసిన జీవో 446ను సవాలు చేస్తూ సురేష్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తన తొలగింపు ఉత్తర్వుల అమలును నిలిపి వేయాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, జీవో 446 అమలును నిలిపి వేసేందుకు నిరాకరిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సురేష్‌బాబు ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ నూనెపల్లి హరినాథ్, డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సురేష్ బాబు తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
తన కుటుంబ సభ్యులు చేస్తున్న కాంట్రాక్ట్ పనుల గురించి పిటిషనర్ సురేష్ బాబుకు తెలియదన్నారు. దీనిని పిటిషనర్‌కు వ్యతిరేకంగా వాడారని, ఇది అన్యాయమని వివరించారు. ఈ విషయం పాలక మండలి ముందుకు రాలేదని, అందువల్ల వాటితో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిని ఉల్లంఘన కింద భావించడానికి వీల్లేదన్నారు. పిటిషనర్‌ను మేయర్‌గా తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో సహేతుక కారణాలను పేర్కొన లేదని చెప్పారు.
మేయర్‌గా సురేష్ బాబు పదవీ కాలాన్ని ఇలా ఏకపక్షకంగా అడ్డుకోలేరన్నారు. పిటిషనర్‌కు వాదనలు వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని తెలిపారు. న్యాయవాది యతీంద్రదేవ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం యథాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై చట్ట ప్రకారం తిరిగి విచారణ జరపాలని, తన వాదనలు వినిపించేందుకు సురేష్ బాబుకు తగిన అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.