మీరు చెబుతున్నదానికి.. పరిస్థితులకు పొంతన లేదు కదా? | High Court doubts installation of CCTV cameras in police stations | Sakshi
Sakshi News home page

మీరు చెబుతున్నదానికి.. పరిస్థితులకు పొంతన లేదు కదా?

Jul 9 2025 5:24 AM | Updated on Jul 9 2025 5:26 AM

High Court doubts installation of CCTV cameras in police stations

పోలీస్‌ స్టేషన్‌లలో సీసీ కెమెరాల ఏర్పాటుపై హైకోర్టు సందేహం

అన్నిచోట్ల అన్నీ కనిపించేలా ఏర్పాటు చేశామన్న పోలీసులు

వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయన్న ధర్మాసనం

నిగ్గు తేల్చేందుకు న్యాయవాదులతో కమిటీ వేస్తామని స్పష్టీకరణ

విచారణ వచ్చే వారానికి వాయిదా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పోలీస్‌ స్టేషన్లలో లోపల, బయట అన్నీ కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ధ్రువీకరిస్తూ దాఖలు చేసిన నివేదికలపై హైకోర్టు సందేహాలు లేవనెత్తింది. పోలీ­సులు చెబుతున్నదానికీ, క్షేత్రస్థాయిలో పరిస్థి­తు­లకీ పొంతన కనిపించడం లేదని తెలిపింది. విజ­యవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషనే ఇందుకు ఉదాహరణ అని పేర్కొంది. ఈ ఠాణాలో సీసీ కెమె­రాలు ఏర్పాటు చేశామని విజయవాడ అసి­స్టెంట్‌ కమిషనర్‌ ధ్రువీకరించారని, ఇదే స్టేషన్‌కు సంబంధించి మరో కేసులో సంబంధిత మేజిస్ట్రేట్‌ ఒక్క సీసీ కెమెరా మాత్రమే ఉందని తమకు నివేదిక ఇచ్చారని తెలిపింది. 

ఈ నేపథ్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై వాస్తవాలను తేల్చేందుకు న్యాయ­వాదులతో కమిటీ ఏర్పాటు చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని స్టేషన్‌లలో సీసీ కెమె­రాలు ఏర్పాటు చేశారు? స్టేషన్‌ లోపల, బయట కనిపించేలా వాటిని ఏర్పాటు చేశారా? సక్రమంగా పనిచే­స్తున్నాయా? తదితర వివరా­లను న్యాయవా­దుల కమి­టీ ద్వారా తెప్పించుకుంటామని తెలిపింది. ఇ­ప్ప­టికీ చాలా స్టేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ఎందుకనేది వివరణ ఇవ్వా­లని ప్రభు­త్వాన్ని ఆదేశించింది. తదుపరి విచార­ణను వచ్చే వారానికి వాయిదా వేస్తూ న్యాయమూ­ర్తులు జస్టిస్‌ రావు రఘు­నందన్‌రావు, జస్టిస్‌ జగడం సుమతిల ధర్మా­స­నం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.

» సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ స్టేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదంటూ న్యాయ­వాది తాండవ యోగేష్‌  ప్రజా ప్రయో­జన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం అన్ని స్టేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, వీటిని ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ యోగేష్‌ కోర్టు ధిక్కార పిటి­షన్‌ వేశారు. 

ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రఘు­నందన్‌రావు ధర్మాసనం మంగళవారం మరో­సారి విచారణ జరిపింది. పిటిషనర్‌ యోగేష్‌ వాద­నలు వినిపిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 1,392 పోలీస్‌ స్టేషన్‌లు ఉంటే 1,001 చోట్ల మాత్రమే సీసీ కెమెరాలు పెట్టారన్నారు. మిగిలిన స్టేషన్‌లలో కూడా ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

అక్కడ తప్ప అన్నీ స్టేషన్‌లలో ఏర్పాటు చేశాం
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) టి.విష్ణు­తేజ వాదనలు వినిపిస్తూ, లాకప్‌లు ఉన్న అన్ని స్టేషన్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, లాకప్‌లు లేనిచోట పెట్టలేదన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. చాలా కేసు­ల్లో నిందితులను అరెస్ట్‌ చేసి లాకప్‌­లు లేని కార్యాలయాలు, పోలీసు ట్రైనింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లి హింసించిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనివి స్టేషన్ల నిర్వచనం పరిధిలోకి వస్తాయో రావో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

పోలీసుల దర్యాప్తు తీరుపై సందేహం కలుగుతోంది
ఆటో డ్రైవర్‌ కస్టోడియల్‌ టార్చర్‌పై స్పందించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: టీడీపీ కార్యకర్త ఫిర్యాదు ఇవ్వగానే ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని తీవ్రంగా హింసించిన ఘటనపై హైకోర్టు స్పందించింది. పల్నాడు జిల్లా, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్, ఎస్‌ఐ సౌందర్య రాజు చిత్రహింసలకు గురిచేశార­ని బాధితుడి తండ్రి ఆరోపిస్తున్న నేపథ్యంలో మొ­త్తం వ్యవహారంపై సమగ్ర అఫిడవిట్‌ దాఖలు చే­యా­లని పల్నాడు ఎస్పీని ఆదేశించింది. అరెస్ట్‌ సహా జరిగినదంతా గమనిస్తే పోలీసుల దర్యాప్తు తీరుపై ప్రాథమికంగా సందేహం కలుగుతోందని తెలిపింది. 

అరెస్ట్‌కు దారితీసిన పరిస్థితులు, తదనంతర పరిణామాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందు ఉంచాలంది. గత నెల 21 సాయంత్రం 4 గంటల నుంచి 23వ తేదీ మధ్యాహ్నం వరకు దాచేపల్లి పోలీస్‌ స్టేషన్‌ నుంచి తంగేడు గ్రామం చెన్నయపాళెం క్రాస్‌రోడ్డు వరకు సీసీ కెమెరాల ఫుటేజీని సమర్పించాలని దాచేపల్లి పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరి­నాథ్‌ ఉత్తర్వులిచ్చారు. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.

దాచేపల్లి మండలం తంగెడకి చెందిన హరికృష్ణ ఎన్నికల సమయంలో తమపై బాంబులు వేశారని, తాజాగా హత్యాయత్నం చేశారంటూ టీడీపీ కార్యకర్త షేక్‌ హుస్సేన్‌ ఈ ఏడాది మే 22న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే తన కుమారుడిపై కేసు న­మో­దు చేసి అరెస్ట్‌ చేశారని, విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టారని హరికృష్ణ తండ్రి ఎల్ల­య్య హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తన కుమా­రుడి అరెస్ట్‌ను చట్ట­విరుద్ధంగా ప్రకటించా­లని కోరారు. దీనిపై జస్టిస్‌ హరినాథ్‌ ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది సూరపురెడ్డి గౌతమి వాదించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement