Rain Forecast In Andhra Pradesh: Next 3 Days Heavy Rains In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు

Sep 6 2021 2:33 AM | Updated on Sep 6 2021 3:02 PM

Heavy rains for the next 3 days Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆదివారం వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.

తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంవల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ రాగల రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరంలో 15సెం.మీ, పూసపాటిరేగలో 14.3 సెం.మీ, డెంకాడలో 14.2, కొప్పెర్లలో 13.5, గోవిందపురంలో 12.8, నెల్లిమర్లలో 12.2, రాంబిల్లిలో 10.9, పైడి భీమవరంలో 10.8, కె.కోటపాడులో 9.5, బొందపల్లిలో 8.7, భోగాపురంలో 8.4, మారికవలస, భీమిలిలో 8.3, ఎల్‌.ఎన్‌.పేటలో 8.1, కొయ్యూరులో 7.8, విశాఖ రూరల్, దేవరాపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 

Advertisement
 
Advertisement
Advertisement