Heavy Rains: వర్షాల కారణంగా మృతి చెందిన వారికి రూ.5 లక్షలు: సీఎం జగన్‌

Heavy Rains: CM YS Jagan Video Conference With Collectors - Sakshi

వరద సహాయక చర్యలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష

3 జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం

సాక్షి, అమరావతి: భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతాలకుతలం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్షాలపై ఐదు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు.
(చదవండి: ఎక్కడా రాజీపడొద్దు.. నిరంతరం అందుబాటులో ఉంటా: సీఎం జగన్‌

వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి మూడు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు సీఎం జగన్‌. నెల్లూరు, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్‌కు నివేదిస్తారు. 
(చదవండి: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద.. విమానాల ల్యాండింగ్‌ నిలిపివేత)

వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికిగాను నెల్లూరు జిల్లాకు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజేశేఖర్‌.. చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్‌ కమిషనర్‌ ప్రద్యుమ్న.. వైఎస్‌ఆర్‌ జిల్లాకు సీనియర్‌ అధికారి శశిభూషణ్‌ కుమార్‌ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 

‘‘ముంపు బాధితులను కూడా వెంటనే సహాయక కేంద్రాలకు తరలించాం. వరదలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ల ద్వారా తరలించే చర్యలు కూడా చేపట్టాం. సహాయక కార్యక్రమాల్లో ఎక్కడా రాజీలేకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. ఆయా జిల్లాలకు అదనంగా నిధులు కూడా ఇచ్చాం’’ అని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. 

తర్వాత జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు సీఎం జగన్‌. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్, స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న జిల్లాలోని పరిస్థితులను వివరించారు. ఈ సదర్భంగా సీఎం జగన్‌.. తిరుపతిలో వరదనీరు నిల్వ ఉండిపోవడానికి కారణాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. చెరువుల పూడ్చివేత వల్ల ఇది జరిగిందని అధికారులు తెలపడంతో.. దీనిపై తగిన కార్యచరణసిద్ధం చేయాలని.. బాధితులను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ఇళ్లను శుభ్రం చేసుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందని తెలిపారు. బాధితులకు నాణ్యమైన సేవలు అందించాలని.. మంచి భోజనం, తాగునీరు అందించాలని.. వర్షాల తర్వాత కూడా వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులకు సహాయంగా నిలవాలని సీఎం జగన్‌ తెలిపారు. రైళ్లు, విమానాలు రద్దైన నేపథ్యంలో వారికి అన్నిరకాలుగా తోడుగా ఉండాలన్నారు. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో భక్తులు కిందకు రాకుండా పైనే ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం ఒకటి, రెండు రోజులు వారికి తగిన వసతులు సమకూర్చాలని తెలిపారు.

టీటీడీ అధికారులను సమన్వయం చేసుకుని యాత్రికులకు సహాయంగా నిలవాలన్నారు. తిరుపతినగరంలో మున్సిపాల్టీ సహా, ఇతర సిబ్బందిని కూడా వినియోగించి పారిశుధ్యం పనులు చేపట్టాలని.. అవసరమైతే ఇతర మున్సిపాల్టీలనుంచి సిబ్బందిని తీసుకు వచ్చి ఆపరేషన్‌ చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

వైఎస్సార్‌ జిల్లాలో..
వైఎస్సార్‌ జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్‌ విజయరామరాజు. ఈ క్రమంలో గండ్లుపడ్డ చెరువుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు సీఎం జగన్‌. రోడ్లకు గండ్లు కారణంగా ఎక్కడ రవాణా స్తంభించినా... నీరు తగ్గగానే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్‌ పునరుద్ధరణపైనా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. వరదనీరు తగ్గగానే పంట నష్టంపై అధికారులు ఎన్యుమరేషన్‌ ప్రారంభించాలని సీఎం జగన్‌ సూచించారు. 

నెల్లూరు జిల్లాలో..
నెల్లూరు జిల్లాలో పరిస్థితులను వివరించారు కలెక్టర్‌ చక్రధర్‌. సోమశిలకు భారీగా వరద నీరు వస్తోందని తెలిపారు. ఈ క్రమంలో సమగ్ర వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పైనుంచి వరదను, డ్యాంలో ప్రస్తుతం ఉన్ననీటిని అంచనా వేసుకుని ఆమేరకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులను సమన్వయం చేసుకుని వరదనీటి విడుదలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎక్కడెక్కడ ముంపు ఉండే అవకాశాలు ఉన్నాయో.. ఆయా ప్రాంతాల్లో సహాయక కేంద్రాలను తెరవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

అనంతపురంలో..
అనంతపురంలో భారీ వర్షాల పరిస్థితిని వివరించారు కలెక్టర్‌ నాగలక్ష్మి. అలానే బాధిత జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లపై వివరాలను  ప్రిన్సిపల్‌ సెక్రటరీలు కృష్ణబాబు, ద్వివేది అందించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతాల్లో రోడ్ల పునరుద్ధరణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే తాగునీటి వనరులు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి... తాగునీటి నాణ్యతను తెలుసుకోవాలని, వ్యాధులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యంపైనకూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.

‘‘ఎక్కడెక్కడ పంట నష్టపోయిందీ వివరాలు తయారు చేయాలి. వీలైనంత త్వరగా వారికి పరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నష్టాన్ని నమోదు చేసినప్పుడు కాస్త ఉదారతతో ఉండాలి. మళ్లీ పంటవేసుకునేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేయాలి. వర్షాల కారణంగా దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి రూ.5 లక్షల పరిహారం వీలైనంత త్వరగా అందించాలి. జిల్లాల్లో కాల్‌సెంటర్లను ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే వినతులపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎలాంటి సహాయం కావాలన్న యుద్ధప్రాతిపదికన సమకూరుస్తాం’’ అని సీఎం జగన్‌ తెలిపారు.

నెల్లూరులో సహాయక చర్యల పర్యవేక్షణకు నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌ను పంపిస్తున్నామని.. కడపజిల్లాల్లో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఇప్పటికే సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని సీఎం జగన్‌ తెలిపారు. 

చదవండి: తిరుపతి విల విల

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top