ఏపీలో హోరెత్తిన వాన

Heavy Rainfall Lashes Parts In Andhra Pradesh - Sakshi

బంగాళాఖాతంలో అల్పపీడనంతో విస్తారంగా వర్షాలు 

రాష్ట్ర వ్యాప్తంగా పొంగుతున్న వాగులు, వంకలు 

పలు జిల్లాల్లో నిండిన చెరువులు, రిజర్వాయర్లు 

సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కూడా వర్షం జోరుగా కురిసింది. రెండ్రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు జిల్లాల్లో చెరువులు పూర్తిగా నిండిపోయాయి. రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరుచేరింది. రాష్ట్రంలోని 19,494 హెక్టార్లలో పంటలపై వర్ష ప్రభావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చేలల్లోని నీటిని బయటకు పంపితే పంటలకు పెద్దగా నష్టం ఉండదని చెబుతున్నారు.  

  • కర్నూలు జిల్లాలో 24 గంటల్లో 31.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. పాములపాడులో రికార్డు స్థాయిలో 184.6 మి.మీ వర్షం కురిసింది. కుందూ నది, కొత్తపల్లి మండలంలోని ఎద్దులేటి వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈసెట్, ఇతర పరీక్షలు రాసేందుకు విద్యార్థులు ప్రమాదకర రీతిలో పుట్టిలో ప్రయాణించి వాగు దాటి వెళ్లా్లల్సి వచ్చింది.  
  • అనంతపురం జిల్లాలో పంట బెట్టకు వచ్చిన ప్రాంతాలకు ఈ వానలు పనికి వస్తాయని చెబుతున్నారు. జిల్లాలో సెప్టెంబర్‌ నెల సాధారణ వర్షపాతం 118.4 మి.మీ కాగా ఇప్పటికే 136.3 మి.మీ వర్షం కురిసింది.  
  • వైఎస్సార్‌ జిల్లాలో ఒక్కరోజే 48.9 మి.మీ వర్షపాతం నమోదైంది. పెన్నా, కుందూ నదులు, సగిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇసుక వంక పోటెత్తడంతో జమ్మలమడుగు, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ పట్టణాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో 300 చెరువులు పూర్తిగా నిండాయి.  
  • గుంటూరు జిల్లాలోని కొండవీటివాగు, పొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సచివాలయానికి రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు హైవేపైకి చేరడంతో దాచేపల్లిలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.  
  • కృష్ణా జిల్లాలో సగటున 50.70 మి.మీ. వర్షం కురిసింది. తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో వైరా, కట్టలేరు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో నందిగామ, వీరుళ్లపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.  
  • ఎగువ నుంచి వరదతో పశ్చిమ గోదావరి జిల్లాలోని తమ్మిలేరు రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టానికి  చేరుకుంది. తమ్మిలేరు, ఎర్రకాల్వ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. దీంతో ఏలూరు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.   
  • విజయనగరం జిల్లాలో, ప్రకాశం జిల్లా మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో, చిత్తూరు జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షాలు పంటలకు బాగా మేలు చేస్తాయని రైతులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో దగదర్తి మండలంలో తప్ప మరెక్కడా పంటపై వర్ష ప్రభావంలేదు.  

వరిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 
గోదావరి, డెల్టాలో వరి పొలాలు చిరుపొట్ట దశలో ఉంటే తక్షణమే నీళ్లు బయటకు పోయేలా పిల్ల కాల్వలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. తక్షణమే నత్రజనితో పాటు మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ని బూస్టర్‌ డోస్‌గా వేయాలని, పంటలో జింకు లోపం ఉంటే రెండు దఫాలుగా జింక్‌ సల్ఫేట్‌ను పిచికారీ చేయాలని చెప్పారు.

ఉధృతంగా కృష్ణమ్మ
సాక్షి,విజయపురి సౌత్‌ (మాచర్ల): కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలకు.. తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,25,082 క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో క్రస్ట్‌ గేట్లను తెరచి నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది క్రస్ట్‌ గేట్లను తెరవటం ఇది నాలుగోసారి. ఎగువన ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాలతోపాటు హంద్రీ నది నుంచి శ్రీశైలానికి జలాలు వచ్చి చేరుతున్నాయి. కుడిగట్టు కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ మొత్తంగా 2,54,526 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలంలో 884.80 అడుగుల్లో 214.36 టీఎంసీలు ఉన్నాయి. నాగార్జున సాగర్లోకి 2,14,082 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరింది. అంతే స్థాయిలో వరద జలాలను స్పిల్‌ వే గేట్లు, విద్యుత్‌ కేంద్రం ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతలలోకి 2,30,541 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,32,404 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.దీనికి తోడు ప్రకాశం బ్యారేజీలోకి 2,70,822 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. బ్యారేజీ వద్ద 70 గేట్లు ఎత్తి 2,24,931 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

గోదావరిలోనూ పెరిగిన ప్రవాహం: ఛతీస్‌గఢ్, ఒడిశా, వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,10,427 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగిలిన 2,07,341 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు.

పోటెత్తిన పెన్నా: వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో పెన్నా, దాని ఉప నదులు పోటెత్తాయి. దాంతో గండికోట, మైలవరం ప్రాజెక్టుల గేట్లు ఎత్తేశారు. సోమశిల ప్రాజెక్టులోకి 47,491 క్యూసెక్కులు చేరుతుండటంతో సోమశిలో నీటి నిల్వ 61 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే సోమశిల నిండిపోతుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top