విలయం.. యువ హృదయం!

Heart disease on the rise young - Sakshi

యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు   

30 ఏళ్లకే  గుండెపోటు

ఒత్తిళ్లు, జీవనశైలి వ్యాధులే కారణం 

ఆరోగ్యకర జీవనశైలి అవసరమంటున్న వైద్యులు

విజయవాడ క్రీస్తురాజుపురానికి చెందిన 40 ఏళ్ల యువకుడు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల ఓ రోజు ఉదయం ఛాతిలో నొప్పి అని చెప్పి కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు విడిచాడు. తీవ్రమైన గుండెనొప్పి కారణంగా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తేల్చారు. 

విజయవాడ వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఇటీవల ఓ రోజు అర్ధరాత్రి ఛాతిలో నొప్పి అని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ప్రాణాలు కోల్పోయాడు. 

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఇటీవల కా­లం­లో యువతలో గుండె పోటు మరణాలు ఎక్కువ­గా సంభవించడం వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. మరీముఖ్యంగా 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు వారికి గుండెపోటు మ­ర­­ణాలు పెరిగిపోయాయి. మారుతున్న జీవన శైలి, దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న  తీవ్రౖ­మెన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, పెరిగిపోతు­న్న కాలుష్యం కారణంగానే చిన్న వయస్సులో గుండె జబ్బుల మరణాలు సంభవిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ని యంత్రించేందు­కు ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించాల్సిన అవసరముందంటున్నారు. అడ్వాన్స్‌డ్‌ ప­రి­కరాలను ఉపయోగించుకుని 
గుండె సమ­స్య­ల­­­ను ముందుగానే గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు.
 
అందుకే ఆకస్మిక మరణాలు  

గుండె ఆగిపోవడం వల్ల సంభవిస్తున్న మరణా లకు వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు.   

 •  మధుమేహం, రక్తపోటు. 
 • ధూమపానం, మద్యపానం,ఊబకాయం, వ్యాయామం లేకపోవడం 
 •   పోస్టు కోవిడ్‌  
 •  గుండె రక్తనాళాల్లో పూడికలు, గుండె కండరాలు ఉబ్బడం(మయోకార్డిటైస్‌) 
 •  పల్మనరీ ఎంబోలిజం(గుండె నుంచి ఊపి­రి తిత్తులకు వచ్చే రక్తనాళాల్లో పూడికలు)  

 ముందు జాగ్రత్తే మందు  
గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు 
ప్రతి ఒక్కరూ పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.  

 •  శ్రమతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం   
 •  స్వచ్ఛమైన ఆహారాన్ని తీసుకోవడం   
 •  క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం   
 •  ఒత్తిళ్లకు దూరంగా ఉండటం
 • నీరు ఎక్కువగా తీసుకోవడం

యువతలో అధికమవుతున్నాయ్‌..   
గుండెపోటుకు గురవుతున్న యువతను ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి వారిలో 80 శాతం మందికి గుండెపోటు రావడానికి పొగతాగడం, మద్యం తీసుకోవడం, ఒత్తిడే కారణాలు. రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఏర్పడిన వారిని గుర్తించి స్టెంట్స్‌ వేస్తున్నాం. పోస్టు కోవిడ్‌ వారిలో కూడా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తపోటు, మధుమేహం ఉన్న వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా, మెడిటేషన్‌ను అలవర్చుకోవాలి.   – డాక్టర్‌ బొర్రా విజయ్‌చైతన్య, కార్డియాలజిస్ట్‌
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top