
మద్యం బాటిల్‌కు పూజ చేస్తూ
పూటుగా మద్యం తాగి.. మీరూ తాగండి.. అంటూ రీల్ చేస్తున్న పోలీస్
కూటమి ప్రభుత్వ మద్యం పాలసీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన హెడ్ కానిస్టేబుల్
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
ఆళ్లగడ్డ: కొందరు పోలీసుల తీరు వల్ల నాలుగో సింహం నవ్వులపాలవుతోంది. పోలీసు శాఖ ప్రతిష్ట మంటకలుస్తోంది. ఇందుకు ఆళ్లగడ్డ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని దొర్నిపాడు పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ తీరే తాజా నిదర్శనం. ఆయన యూనిఫాం ధరించే పూటుగా మద్యం తాగి పలు సినిమా పాటలకు రీల్స్ చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ బ్రహా్మండంగా ఉంది... పేదవాడికి తక్కువ ధరకే కోరుకున్న మద్యం అందుతోంది... నేను ఫుల్లుగా తాగుతున్నాను.
మీరూ తాగండి.. అంటూ రీల్స్(విడియోలు) చేసి వాటిని ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులు, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో పెడుతున్నాడు. పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం.. అంటూ కొందరికి మద్యం సీసాలు పంచుతూ కూడా రీల్స్ చేశాడు. ఆయన కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి అనధికార బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ వీడియోలు వైరల్‌గా మారాయి.
మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత గల పోలీసే ఇలా అత్యంత బాధ్యతారాహిత్యంగా మద్యం తాగి.. మీరూ తాగండి... అంటూ రీల్స్ చేస్తుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అతని రీల్స్‌ను ఉన్నతాధికారులు చూసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ రీల్స్ చూసి యువత చెడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.