మూడు పారిశ్రామిక కారిడార్లున్న ఏకైక రాష్ట్రం ఏపీ

Gudivada Amarnath says AP is only state with three industrial corridors - Sakshi

25 వేల ఎకరాలలో అన్ని జిల్లాలను కలుపుతూ ఏర్పాటు 

ఎన్‌ఐసీడీఐటీ అపెక్స్‌ మానిటరింగ్‌ అథారిటీ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌

సాక్షి, అమరావతి: మూడు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటేనని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ అధ్యక్షతన నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌ఐసీడీసీ) అపెక్స్‌ మానిటరింగ్‌ అథారిటీ సమావేశం గురువారం ఢిల్లీ వేదికగా జరిగింది.

డీపీఐఐటీ, నిక్‌డిక్ట్‌ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి అమర్‌నాథ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఎన్‌ఐసీడీసీ ద్వారా మౌలిక వసతుల కల్పనకు ఏపీ పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి అమర్‌నాథ్‌ చెప్పారు. చెన్నై – బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (సీబీఐసీ), విశాఖపట్నం– చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (వీసీఐసీ), హైదరాబాద్‌ – బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌ (హెచ్‌బీఐసీ)లలోని కృష్ణపట్నం పారిశ్రామిక నోడ్, కొప్పర్తి,  శ్రీకాళహస్తి – ఏర్పేడు, ఓర్వకల్‌ నోడ్‌లలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. నిక్‌డిక్ట్‌ నిధుల ద్వారా ఈ పనులు జరుగుతున్నాయని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుతూ 25 వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతాయన్నారు. ఇవి పూర్తయితే 2040 కల్లా ఏపీలో రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు, 5.50 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. విశాఖపట్నంలో నక్కపల్లి క్లస్టర్, గుట్టపాడు క్లస్టర్లను కూడా పారిశ్రామికంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మూడు కారిడార్లకు ప్రణాళికాబద్ధంగా నిధులను సమీకరించి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. భూ సమీకరణ, ప్రాజెక్టుపై పూర్తి నివేదిక తయారు చేయడం, నీరు, విద్యుత్‌ సరఫరా, టెండర్లు సహా కీలకమైన పనులను ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిక్‌డిక్ట్‌ (ఎన్‌ఐసీడీఐటీ) నిధులు, నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్, ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) సహకారంతో కారిడార్ల అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ సాయాన్ని మంత్రి కోరారు.  

ఈ సమావేశంలో కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్, కేంద్ర రైల్వే, ఐటీ, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, నీతి ఆయోగ్‌ చైర్మన్‌ సుమన్‌ బేరీ తదితరులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ తరఫున పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌ ఢిల్లీలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయం నుంచి మంత్రితోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన, ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్, ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సుదర్శన్‌ బాబు, రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top