బాబు సర్కార్‌ మళ్లీ వెనుకబాటే.. జూన్‌లోనూ ఏపీ జీఎస్టీ వృద్ధి సున్నా | Gst Growth Rate Fall Down Again In Chandrababu Govt | Sakshi
Sakshi News home page

బాబు సర్కార్‌ మళ్లీ వెనుకబాటే.. జూన్‌లోనూ ఏపీ జీఎస్టీ వృద్ధి సున్నా

Jul 1 2025 8:29 PM | Updated on Jul 1 2025 9:08 PM

Gst Growth Rate Fall Down Again In Chandrababu Govt

సాక్షి, విజయవాడ: జూన్‌లోను ఏపీ జీఎస్టీ వృద్ధి సున్నా నమోదైంది. జీఎస్టీ ఆదాయంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వెనుకపడింది. గత ఏడాది జూన్ కంటే ఈ ఏడాది జూన్ నెలలో ఆదాయం పెరగలేదు. గత ఏడాది జూన్ కంటే రూ.16 కోట్లు జీఎస్టీ ఆదాయం తగ్గింది. 2024 జూన్‌లో రూ.3,651 కోట్లు జీఎస్టీ ఆదాయం రాగా.. ఈ ఏడాది జూన్‌లో 3,634 కోట్లకు మాత్రమే జీఎస్టీ ఆదాయం పరిమితమైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలోనూ నెగటివ్ గ్రోత్ నమోదైంది. ఇప్పుడు జూన్ నెలలోనూ జీఎస్టీ వృద్ధి సున్నా.. చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి అత్యధిక నెలలు జీఎస్టీ ఆదాయం తగ్గిపోయింది.

కాగా, రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజల కొనుగోలు శక్తి పెరగకపోగా రోజురోజుకీ క్షీణిస్తోంది. ప్రజల వద్ద డబ్బుల్లేక వాణిజ్య కార్యకలాపాలు మందగించడంతో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు నేలచూపులు చూస్తున్నాయి. దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లు రికార్డులు సృష్టిస్తుంటే.. మన రాష్ట్రంలో ఏ నెలకానెల క్షీణిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం మే నెలలోనూ జీఎస్టీ వసూళ్లు 2 శాతానికి పైగా క్షీణించాయి.

2024–25 ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.3,890 కోట్లు (ఎస్‌జీఎస్టీ సెటిల్‌మెంట్‌కు ముందు) ఉన్న జీఎస్టీ వసూళ్లు ఈ ఏడాది మే నెలలో 2.23 శాతం తగ్గి రూ.3,803 కోట్లకు పరిమితమైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా స్థూల జీఎస్టీ వసూళ్లు 13.166 శాతం పెరిగి.. రూ.1.31 లక్షల కోట్ల నుంచి రూ.1.49 లక్షల కోట్లకు చేరాయి.

ఏపీ జీఎస్టీ వసూళ్లు క్షీణిస్తుండటం కలవరపాటుకు గురిచేస్తోంది. సంక్షేమ పథకాలు ఆపేయడం, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా కేవలం కబుర్లతో కాలక్షేపం చేయడం, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోవడం వంటి అనేక కారణాలు రాష్ట్రంలో వాణిజ్య కార్యకలాపాలు మందగించడానికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement