పెరుగుతున్న పట్టణ జనాభా

Growing urban population - Sakshi

2021–36లో దేశంలో 39% జనాభా పట్టణాల్లోనే.. 

ఏపీలో పట్టణాల్లోనే 42 శాతం మంది  

2036 నాటికి 152 కోట్లకు దేశ జనాభా 

‘నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ పాప్యులేషన్‌’ నివేదిక వెల్లడి 

సాక్షి, అమరావతి: దేశంలో పట్టణ జనాభా గణనీయంగా పెరుగుతోంది. రానున్న కాలంలో ఇది రికార్డు స్థాయిలో ఉండనుందని, 2021–36 మధ్య కాలంలో మరింతగా పెరగనుందని ‘నేషనల్‌  కమిషన్‌ ఆన్‌ పాప్యులేషన్‌’ తన తాజా నివేదికలో వెల్లడించింది. కేంద్ర ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఈ సంస్థ దేశ జనాభాపై నిర్వహించిన అధ్యయనంలో.. 2011–21తో పోలిస్తే 2021–36లో దేశ జనాభా పెరుగుదల రేటు బాగా తగ్గనుందని చెప్పింది. అయితే, మొత్తం జనాభాలో మాత్రం భారత దేశం చైనాను అధిగమించి మొదటి స్థానానికి చేరుకోనుంది. నివేదికలోని మరిన్ని ప్రధాన అంశాలను పరిశీలిస్తే... 

పల్లెల్లో తగ్గుతున్న జనాభా
► 2011తో పోలిస్తే 2036 నాటికి దేశంలో పట్టణ జనాభా 57 శాతం పెరగనుంది.  
► 2011లో 37.70 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 59.40 కోట్లకు చేరుకోనుంది. అంటే, 31 నుంచి 39 శాతానికి చేరుకుంటుంది.  
► ఇక 2011లో 69 శాతంగా ఉన్న గ్రామీణ జనాభా 2036 నాటికి 61 శాతానికి తగ్గుతుంది.  
► ఢిల్లీ జనాభాలో 98 శాతం పట్టణ జనాభా ఉండగా 2036 నాటికి 100 శాతానికి చేరుకుంటుంది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో 50 శాతానికి పైగా జనాభా పట్టణాల్లోనే ఉంటుంది.  ఏపీలో పట్టణ జనాభా 42 శాతానికి చేరుకుంటుంది.  

 ఉత్తరాదిలోనే పెరుగుదల.. దక్షిణాదిలో నియంత్రణ 
ఎప్పటి మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందంజలో ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోనే జనాభా పెరుగుదల అధికంగా ఉండనుంది. 
► ఉత్తర ప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాలు జనాభా పెరుగుదలలో మొదటి రెండు స్థానాల్లో ఉండనున్నాయి. పెరిగే జనాభాలో 36 శాతం ఆ రాష్ట్రాల్లోనే ఉండనుంది. 
ఇక 2011లో ప్రతి 1,000 మంది పురుషులకు 943 మందిగా ఉన్న స్త్రీలు , 2036 నాటికి 952 మందికి చేరుకోనున్నారు. కాగా ఏపీ, తమిళనాడు, కేరళలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు.  

2036 నాటికి 152 కోట్ల జనాభా 
► దేశ జనాభా 2021 నాటికి 136 కోట్లకు, 2031 నాటికి 147 కోట్లకు, 2036 నాటికి 152 కోట్లకు చేరుతుంది. 
► 2011–21లో దేశ జనాభా పెరుగుదల రేటు 12.5 శాతం ఉంటుందని కమిషన్‌ పేర్కొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఇదే అతి తక్కువ జనాభా పెరుగుదల రేటు. కాగా, 2021–31లో దేశ జనాభా పెరుగుదల రేటు 8.4 శాతానికి తగ్గుతుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top