
టీడీపీ వీరవిధేయఅధికారి సెటిల్‌మెంట్ల దందా
ప్రత్యేక పోలీస్ బృందంతో హడలెత్తిస్తున్న వైనం
కిడ్నాపులు... బెదిరింపులు... సెటిల్‌మెంట్లు
ఆ 4 జిల్లాల్లోవందలాది బాధితులు
ఏవోబీ గంజాయి మాఫియాతోనూ లింకులు
గతంలో కాకినాడ పోర్టులోనూ దందా
ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం
మహేశ్‌బాబు నటించిన పోకిరి సినిమాలో అవినీతిపరుడు, దందాలు చేసే సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా ఆశిష్ విద్యార్థి తుపాకీ గురిపెట్టి మరీ సెటిల్‌మెంట్లు సాగిస్తుంటాడు. భూములు, ఫ్లాట్లు రాయించుకుంటాడు. మరి.. అదే తరహా దందాకు ఏకంగా ఓ ఐపీఎస్ స్థాయి పోలీసు తెగబడితే ఎలా ఉంటుందో ప్రస్తుతం రాయల సీమ వాసులు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అందుకే ఆయనకు ‘అనకొండ ఐపీఎస్’ అని పోలీసు వర్గాలే పేరు పెట్టాయి.
ఆయన టీడీపీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అత్యంత అవినీతి ఐపీఎస్ అధికారి.. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితుడు. ఇదే అదనుగా భూ సెటిల్‌మెంట్‌లతో హడలెత్తిస్తున్నారు. అందుకోసం సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని చెలరేగిపోతున్నారు. దాంతో రాయలసీమలో సామాన్యుల భూములకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. ఆయనను కాదంటే ప్రాణాలకే దిక్కుండదని కణతకు తుపాకీ గురిపెట్టి మరీ బెదిరిస్తున్నారు.
సాక్షి, అమరావతి: కర్నూలు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న ఆ ఐపీఎస్ అధికారి సెటిల్‌మెంట్ల దందా కోసం ఎంపిక చేసిన పోలీసు అధికారులతో ఓ టీమ్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ డీఎస్పీ, దాదాపు 12 మంది కిందిస్థాయి అధికారులు, కానిస్టేబుళ్లు అందులో సభ్యులుగా ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన 2007 బ్యాచ్ సీఐ ఒకరు ఈ టీమ్‌కు పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర ముఖ్య నేత పేరుతో ఉన్న ఆ సీఐ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో ఎక్కడెక్కడ ప్రైవేట్ భూ వివాదాలు ఉన్నాయన్నది ఆరా తీస్తారు.
అందులోని ఇరువర్గాల్లో కాస్త మెతకగా ఎవరు ఉన్నారో, ఎవర్ని బెదిరించి లొంగదీసుకోవచ్చునో గుర్తిస్తారు. ఆ వివరాలను అనకొండ ఐపీఎస్‌కు చేరవేరుస్తారు. తర్వాత ఆ ఐపీఎస్ భూ వివాదంలోని ఇరువర్గాల్లో అవతలి పక్షాన్ని పిలిపించి డీల్ మాట్లాడతారు. ‘‘కోర్టు కేసులంటూ ఎన్నేళ్లు తిరుగుతారు? నేను సెటిల్ చేస్తా’’నంటూ పెద్ద బేరం కుదుర్చుకుంటారు. అడ్వాన్స్ అందగానే ఆ ఐపీఎస్ తన బృందంలోని పోలీసు అధికారులను రంగంలోకి దింపుతారు.
భూ వివాదంలో కాస్త మెతకగా ఉన్న కుటుంబ పెద్దను ఆ పోలీస్ పార్టీ అక్రమంగా ఎత్తుకు వస్తుంది. గుర్తుతెలియని ప్రదేశంలో నిర్బంధించి తమ మార్కు ట్రీట్‌మెంట్ రుచి చూపిస్తుంది. భూ వివాదాన్ని తాము చెప్పినట్టుగా సెటిల్ చేసుకోవాలని వేధిస్తారు. పోలీసు దెబ్బలు తట్టుకోలేక... ఎవరికీ చెప్పుకోలేక ఆ కుటుంబసభ్యులు ఐపీఎస్ అధికారి చెప్పినట్టు భూమిపై హక్కులు వదులుకునేందుకు సమ్మతిస్తారు.
ఒక డీల్ సెట్ కాగానే ఐపీఎస్ అధికారి టీమ్ మరో భూ వివాదంపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం రాయలసీమలో యథేచ్ఛగా సాగుతున్న ఐపీఎస్ దందాలో ఏడాది కాలంలో పదుల సంఖ్యలో భూ వివాదాలను తనదైన శైలిలో సెటిల్ చేశారు. భారీగా అవినీతికి పాల్పడుతున్నారు. కర్నూలులో ఆయన కార్యాలయం ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని తలపిస్తోందని పోలీసువర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
కాకినాడ పోర్టులోనూ దందానే!
గత టీడీపీ ప్రభుత్వం ఆ ఐపీఎస్‌ను మౌలిక వసతుల కల్పన శాఖలో కీలక పోస్టులో నియమించింది. వాస్తవానికి ఇది ఐఏఎస్ అధికారితో భర్తీ చేయాల్సిన పోస్టు. కానీ, ఐపీఎస్‌కు కట్టబెట్టడం వివాదాస్పదమైంది. ఇక ఆ పోస్టు దక్కించుకున్న ఆ ఐపీఎస్ విచ్చలవిడిగా అవినీతికి తెగించారు. ప్రధానంగా కాకినాడ పోర్టు కాంట్రాక్టులు, అక్కడి నుంచి బియ్యం, ఇతర ఎగుమతుల్లో ఆయన చేసిన దందా అంతా ఇంతా కాదు. అక్రమంగా 40 మందిని నియమించుకుని మరీ భారీ వసూళ్లకు పాల్పడ్డారు.
ఇద్దరి మధ్య వేలు పెట్టిరూ.1.80 కోట్లు
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఇద్దరు వ్యక్తుల మధ్య 4.2 ఎకరాల భూ వివాదాన్నీ ఆ ఐపీఎస్ అదే రీతిలో సెటిల్ చేశారు. ఓ వ్యక్తికి అనుకూలంగా వ్యవహరించి అవతలి పక్షాన్ని బెంబేలెత్తించారు. ఆయన ఇంటిలోకి పోలీసులు జొరబడి మరీ కుటుంబ సభ్యుల ముందే తీవ్రంగా కొట్టారు. ఈ వివాదంలో వెనక్కితగ్గకపోతే మున్ముందు పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దాంతో హడలిపోయిన ఆ కుటుంబం భూ వివాదం నుంచి వెనక్కుతగ్గింది. ఈ డీల్‌లో ఆ ఐపీఎస్ రూ.1.80 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం.
ఉపాధ్యాయుడినీ వదల్లేదు...
కర్నూలులో 1.50 ఎకరాల భూమిపై వివాదం ఏర్పడింది. ఓ ఉపాధ్యాయుడికి తాతతండ్రుల నుంచి సంక్రమించిన ఈ భూమి తనది అంటూ రియల్టర్ వివాదం సృష్టించారు. ఉపాధ్యాయుడికి అనుకూలంగా కింది కోర్టులో తీర్పు వచి్చనా హైకోర్టులో అప్పీల్ చేశారు. ఇదంతా తెలిసిన అనకొండ ఐపీఎస్ రంగంలోకి దిగారు.
పోలీసులతో కిడ్నాప్ చేయించి, భూమిపై హక్కులు విడిచి పెట్టాలని బెదిరించారు. ఆయన సమ్మతించ లేదని.. పోలీసులు 2రోజులు తమదైన శైలిలో టార్చర్ చూపించి, కదల్లేని స్థితిలోకి తీసుకొచ్చారు. పోలీసులే కిడ్నాప్ చేసి మరీ దాడి చేయడంతో కుటుంబం బెంబేలెత్తింది. అయినాసరే తాము చెప్పినట్టు సెటిల్‌మెంట్‌కు ఒప్పుకోలేదని ఉపాధ్యాయుడిపై అక్రమ కేసు నమోదుచేసి విచారణ పేరుతో వేధిస్తున్నారు.
ఏవోబీ గంజాయి మాఫియా నుంచి నేటికీ వసూళ్లే
అనకొండ ఐపీఎస్ అవినీతి ఊడలు ఆంధ్రా–ఒడిశా సరిహద్దులు (ఏవోబీ) దాక విస్తరించాయి. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పనిచేశారు. అప్పుడు ఏవోబీలో గంజాయి సాగు, స్మగ్లింగ్ మాఫియాలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వారిని నిరోధించకుండా ఉండేందుకు మామూళ్ల డీల్ సెట్ చేసుకున్నారు. ప్రైవేట్ ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు కూడా.
రెండేళ్ల తరువాత విశాఖపట్నం జిల్లా నుంచి బదిలీ అయినా సరే గంజాయి మాఫియా నుంచి మామూళ్ల వసూళ్లు మాత్రం ఆపలేదు. గత ఐదేళ్లలో ఆ ఐపీఎస్ ఆటలు సాగలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే మరోసారి ఏవోబీలో ఏజెంట్ల వ్యవస్థను క్రియాశీలం చేశారు. ప్రస్తుతం రాయలసీమలో పోస్టింగులో ఉన్నా సరే ఏవోబీలోని గంజాయి స్మగ్లర్లు మామూళ్లు ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.
టీడీపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడినైన తాను త్వరలో రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, ఉత్తరాంధ్రలో గానీ పోస్టింగ్ తెచ్చుకుంటానని చెబుతున్నారు. ఇప్పుడు మామూళ్లు ఇవ్వకపోతే ఉత్తరాంధ్ర వచ్చాక అందరి సంగతి తేలుస్తానని బెదిరిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు ఆ అధికారి సన్నిహితుడని తెలిసిన గంజాయి స్మగ్లర్లు మామూళ్లు సమర్పించుకుంటున్నారు.
వందల్లో ఫిర్యాదులు..పట్టించుకోని ప్రభుత్వం
రాయలసీమలో అనకొండ ఐపీఎస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బలవంతపు భూ సెటిల్‌మెంట్లతో వందలమంది ఆస్తులు కోల్పోయారు. పలువురు బాధితులు ఆ అధికారికి వ్యతిరేకంగా ఏసీబీ, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. ఆయనపై వస్తున్న ఫిర్యాదులతో ఏసీబీ వర్గాలే విస్తుపోతుండడం గమనార్హం.
ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్య నేత దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. కానీ తమకు సన్నిహితుడైన ఆ ఐపీఎస్‌కు ప్రభుత్వ పెద్దలు కొమ్ముకాస్తున్నారు. పక్కా ఆధారాలతో సహా నివేదిక సమర్పించినా సరే ఆయనపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రభుత్వ పెద్దల మనోగతం అర్థమైంది. ఇదే అదనుగా అనకొండ ఐపీఎస్ మరింతగా సెటిల్‌మెంట్ల దందాతో పెట్రేగిపోతున్నారు.
రైస్ మిల్లులో కోటి..
అనకొండ ఐపీఎస్... వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తనదైన శైలిలో భారీ సెటిల్‌మెంట్ చేశారు. దాదాపు 5 ఎకరాల్లో ఉన్న ఓ రైస్ మిల్లుపై సివిల్ వివాదం ఏర్పడింది. దానిగురించి తెలుసుకున్న అనకొండ ఐపీఎస్ తన టీమ్‌ను పంపారు. ఆ డీల్ సెట్ చేస్తామని ఓ వర్గానికి ఆఫర్ ఇచ్చారు. వైరి వర్గానికి చెందిన వ్యక్తిని పోలీసులు అపహరించుకువచ్చారు. ట్రీట్‌మెంట్ రుచి చూపించారు. కేవలం నామమాత్రపు రేటుకు రైస్ మిల్లుపై హక్కు వదలుకునేలా చేశారు. ఈ డీల్‌లో ఆ ఐపీఎస్ అధికారికి రూ.కోటి దక్కిందని పోలీసు వర్గాలే చెబుతున్నాయి.