కోటదిబ్బకు ‘జాతీయ’ హోదా | Gottiprolu Declared a National Monument | Sakshi
Sakshi News home page

కోటదిబ్బకు ‘జాతీయ’ హోదా

Jul 7 2026 5:10 AM | Updated on Jul 7 2026 5:10 AM

Gottiprolu Declared a National Monument

గొట్టిప్రోలు సమీపంలోని కోటదిబ్బ ప్రాంతంలోని పురాతన ఆనవాళ్లు

తిరుపతి జిల్లా గొట్టిప్రోలు చారిత్రిక అవశేషాలపై కేంద్రం కీలక ప్రకటన

24.22 ఎకరాల పరిధి రక్షిత ప్రాంతంగా గెజిట్‌ విడుదల 

ఇకపై అంతా ఏఎస్‌ఐ ఆధీనంలోకి

సాక్షి, న్యూఢిల్లీ/నాయుడుపేట టౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ ఆధ్యాత్మిక, చారిత్రిక వైభవానికి కేంద్ర ప్రభుత్వం మరో అరుదైన గుర్తింపునిచ్చింది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని గొట్టిప్రోలు (కోటదిబ్బ) గ్రామంలోని పురాతన దిబ్బ, తవ్వకాల్లో బయటపడిన అపురూప అవశేషాలను జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతత్వ ప్రాంతం (ఆర్కియలాజికల్‌ సైట్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంపార్టెన్స్‌)గా ప్రకటించింది. ఈ మేరకు సోమవారం కేంద్ర సాంస్కృతికశాఖ (భారత పురాతత్వశాఖ–ఏఎస్‌ఐ) రాజపత్రం (గెజిట్‌ నోటిఫికేషన్‌) విడుదల చేసింది.

1958 నాటి పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్టం ప్రకారం ఈ చారిత్రిక భూభాగాన్ని జాతీయ సంపదగా కేంద్రం నోటిఫై చేసింది.  కోటదిబ్బ ప్రాంతానికి జాతీయ హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలోనే అడుగు వేసింది. 2026 జనవరి 30న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేస్తూ, ప్రజల నుంచి ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే తెలియజేయడానికి రెండునెలల గడువు ఇచ్చింది. దీనిపై ఆలయ సమీపంలోను నోటీసు బోర్డు ఏర్పాటు చేసింది. గడువు ముగిసేసరికి ప్రజల నుంచి అభ్యంతరాలు, వ్యతిరేకత ఏమీ వ్యక్తం కాలేదు.

దీంతో కేంద్ర సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ జనరల్‌ యదుబీర్‌సింగ్‌ రావత్‌ ఆదేశాల మేరకు జూలై 2న తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ గెజిట్‌ ప్రకారం గొట్టిప్రోలు గ్రామంలోని సర్వే నంబరు 235 (4.28 ఎకరాలు), సర్వే నంబరు 131/1 (19.94 ఎకరాలు)లోని మొత్తం 24.22 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షిత పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ గెజిట్‌ ప్రకటనతో కోటదిబ్బ పరిసర ప్రాంతాలు పూర్తిగా భారత పురాతత్వశాఖ (ఏఎస్‌ఐ) ఆధీనంలోకి వెళ్లనున్నాయి. చారిత్రిక ప్రాధాన్యత ఉన్న ఈ పురాతన దిబ్బ పరిధిలో అక్రమ తవ్వకాలు, ప్రైవేట్‌ నిర్మాణాలు జరగకుండా కఠినమైన చట్టాలు అమలు కానున్నాయి. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇక్కడ మరిన్ని విస్తృతమైన పురాతత్వ పరిశోధనలు, తవ్వకాలు జరిపేందుకు ఈ నోటిఫికేషన్‌ ఎంతో కీలకం కానుంది.

శాతవాహనుల వాణిజ్య కేంద్రం
గొట్టిప్రోలు గ్రామ సమీపంలో రహదారి పక్కనే ఉన్న కోటదిబ్బ ప్రాంతం రెండువేల సంవత్సరాల కిందట శాతవాహనుల కాలంలో వాణిజ్యకేంద్రంగా విలసిల్లింది. 2020 నుంచి ఈ ప్రాంతంలో తిరుపతి పురావస్తుశాఖ అధికారులు చేసిన తవ్వకాల్లో విగ్రహాలు, బావులు, కోటగోడ, అంతర్భాగంలో ఉండే డ్రైనేజీ వ్యవస్థ, పలు పనిముట్లు బయ­ట­పడ్డాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల అభ్యంతరాలతో నాలుగేళ్ల కిందట పురావస్తుశాఖ అధికారులు అక్కడ తవ్వకాలను నిలిపేశారు. ఇప్పుడు గొట్టిప్రోలు కోటదిబ్బ ప్రాంతాన్ని కేంద్ర పురావస్తుశాఖ స్వాధీనం చేసుకోవడంతో మరింత చరిత్ర వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు.

పాలంపేట శివాలయానికీ గుర్తింపు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి కేంద్ర ప్రభుత్వం మరో అరుదైన గౌరవాన్ని కల్పించింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామంలోని చారిత్రక శివాలయానికి ‘జాతీయ ప్రాధాన్యత కలిగిన పురాతన స్మారక చిహ్నం’గా అధికారిక ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక శాఖ (భారత పురాతత్వ శాఖ –ఏఎస్‌ఐ) సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 1958 నాటి పురాతన కట్టడాలు, పురాతత్వ ప్రదేశాల చట్టం ప్రకారం ఈ ఆలయ పరిధిని జాతీయ సంపదగా ప్రకటించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement