అరచేతిలో అందాల పంట | Gorintaku Designs in Ashada Masam | Sakshi
Sakshi News home page

అరచేతిలో అందాల పంట

Published Sat, Jul 2 2022 9:56 AM | Last Updated on Sat, Jul 2 2022 9:56 AM

Gorintaku Designs in Ashada Masam - Sakshi

కొమ్మాది(భీమిలి): గోరింట పూచింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.. మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు.. గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు.. సిందూరంలా పూస్తే చిట్టి చేయంతా.. అందాల చందమామ అతనే దిగి వస్తాడు అంటూ గోరింటాకు గొప్పతనాన్ని దేవులపల్లి కృష్ణశాస్త్రి ఓ సినిమాలో అద్భుతంగా చెప్పారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆషాఢం, గోరింటాకు, మహిళలకు ఓ ప్రత్యేకమైన సంబంధం ఉంది.  ఆషాఢం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకువస్తుంది. 

ఆషాఢం గడిచేలోపు ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతారు. జ్యేష్ట మాసంలో వర్షాలు మొదలై.. ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అలా తరచూ వర్షపు నీటిలో నానక తప్పదు. ఇక పొలం పనులు చేసుకునే వారు, ఏరు దాటాల్సి వచ్చే వారు, ఈ కాలంలో కాళ్లు చేతులు తడవకుండా రోజులు దాటలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం గోళ్లు దెబ్బతినడం వంటి వాటి నుంచి ఈ గోరింటాకు కొన్ని రోజులు పాటు ఆపుతుంది. ఆషాఢ మాసం నాటికి గోరింట చెట్టు లేత ఆకులతో కళకళలాడుతుంది. ఆ సమయంలో గోరింట పెట్టుకోవడంతో ఎర్రగా పండుతుంది. అందుకే పూర్వం నుంచి ఆషాఢంలో గోరింట పెట్టుకోవడం 
ఆనవాయితీగా వస్తోంది.  

కొత్త పెళ్లికూతురికి సౌభాగ్యం 
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే గోరింటాకు తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింటిలో ఉన్న వధువు, మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది.  

కోన్లతో జాగ్రత్త 
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోమన్నారని చాలా మంది ఎక్కడపడితే అక్కడ దొరికే కోన్‌లపై ఆధారపడుతుంటారు. గోరింట మన శరీరాన్ని తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వలన ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపురంగు కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. దీని వలన ఆరోగ్యం మాట అటు ఉంచితే అలర్జీలు ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఆషాఢంలో ప్రకృతి సహజసిద్ధంగా లభించే గోరింటాకును వాడేందుకు ప్రాధాన్యమివ్వాలి.  

ఒంట్లో వేడిని తగ్గిస్తుంది  
ఆషాఢం నాటికి వాతావరణం ఒక్క సారిగా చల్లబడుతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వలన కఫ సంబంధిత రోగాలు ఏర్పడతాయి. గోరింటాకుకు ఒంట్లో వేడిన తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరిచి రోగాల బారిన పడకుండా చేస్తుంది.
 అన్ని విధాలా మేలు చేస్తుంది. 

సంప్రదాయంతో పాటు ఔషధం కూడా..  
గోరింటాకులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం మాత్రమే కాదు.. వాతావరణంలో జరుగుతున్న మార్పుల వలన సంభవించే శరీర రుగ్మతలను తొలగించే చక్కటి ఔషధం.       
 –జి.ఉష, సాగర్‌నగర్‌ 

చిన్నప్పటి నుంచి కొనసాగిస్తూ.. 
నాకు ఉహ తెలిసిన దగ్గర నుంచి ప్రతి ఆషాఢంలోనూ గోరింటాకు పెట్టుకుంటున్నాను. ఆషాఢం వచ్చిందంటే మా ఇంట్లో అక్కచెల్లెళ్లు అందరం కలసి గోరింటాకు పెట్టుకునేవాళ్లం. అప్పుడు పండగ వాతావరణంలా ఉండేది. 
– మణి సుందరి, వైజాగ్‌ 

పూర్వం నుంచి.. 
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. అయితే ప్రస్తుతం యువతకు ఇది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. గోరింటాకు ఆకులను ముద్దగా చేసుకుని మేము పెట్టుకునే వాళ్లం. అయితే నేడు గోరింటాకు చెట్లు కనుమరుగైపోతున్న తరుణంలో కోన్లకు ప్రాధాన్యమివ్వాల్సి వస్తోంది. 
– పి.ఉమ, వైజాగ్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement