స్టేట్‌బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం.. అకౌంటెంట్‌ స్వప్న ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

స్టేట్‌బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం.. అకౌంటెంట్‌ స్వప్న ఆత్మహత్య

Published Fri, Dec 1 2023 1:28 PM

Gold Missing At Gara Sbi Branch At Srikakulam - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గార ఎస్‌బీఐలో ఖాతాదారులు కుదవ పెట్టిన బంగారు ఆభరణాలు మాయం కావడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారం కనబడకపోవడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు చెబుతున్న ఒక మహిళా ఉద్యోగి ఇప్పటికే ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. ఇప్పుడీ వ్యవహారం బ్యాంకు వర్గాలను కుదిపేస్తోంది. బంగారు ఆభరణాలు గల్లంతుపై పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు కూడా అందడంతో ఇందులో ఎవరి ప్రమేయం ఏమిటో తేల్చే పనిలో పోలీసు యంత్రాంగం నిమగ్నమైంది.

ఇప్పటికే ఫిర్యాదులో నలుగురిని స్పష్టంగా పేర్కొన్నారు. వీరితో పాటు బ్యాంకు అధికారులు, బయట వ్యక్తుల జోక్యంపైనా అనుమానాలుండటంతో పోలీసు వర్గాలు ఆరాతీస్తున్నాయి. ఈ బాగోతం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో చోటు చేసుకున్నా జిల్లాలో అన్ని బ్యాంకులు అప్రమత్తమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటివి ఇంకెక్కడైనా జరిగి ఉండొచ్చేమోనని బ్యాంకు వర్గాలు జాగ్రత్త పడుతున్నాయి.  

నమ్మకాన్ని వమ్ము చేసి.. 
బయట వ్యక్తుల వద్ద బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి సొమ్ము తీసుకోవడం శ్రేయస్కరం కాదని చాలా మంది బ్యాంకుల్లో తమ ఆభరణాలను కుదవ పెట్టి సొమ్ము తీసుకుంటారు. ఆ నమ్మకాన్ని గార ఎస్‌బీఐలో పనిచేసిన కొంతమంది ఉద్యోగులు వమ్ము చేశారు. సూత్రధారులు, పాత్రధారులెవరో విచారణలో తేలనున్నప్పటికీ రూ.4కోట్లకు పైగా విలువైన 7కిలోల బంగారాన్ని మాయం చేశారంటే చిన్న విషయం కాదు. ఇప్పుడా ఖాతాదారులంతా గగ్గోలు పెడుతున్నారు.  

పర్యవేక్షణ డొల్ల.. 
సాధారణంగా బ్యాంకులో గోల్డ్‌ లోన్‌ విభాగం ప్రత్యేకంగా ఉంటుంది. దానికొక అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉన్న అకౌంటెంట్‌ ఉంటారు. క్లర్క్‌ లేదా అప్రైజర్‌ ఉంటారు. వీరిద్దరు ఖాతాదారుల నుంచి తాకట్టు బంగారాన్ని తీసుకుంటారు. వీరితో పాటు ఇద్దరు కస్టోడియన్‌లు ఉంటారు. వీరిద్దరి వద్ద స్ట్రాంగ్‌ రూమ్, సేఫ్‌ (లాకర్లు)కు సంబంధించిన వేర్వేరు తాళాలు ఉంటాయి. అకౌంటెంట్, క్లర్క్‌ తీసుకున్న బంగారాన్ని కస్టోడియన్‌లతో కలిపి సేఫ్‌లలో భద్రపరుస్తారు. ఆ ఇద్దరు కస్టోడియన్‌ల వద్ద ఉన్న వేర్వేరు తాళాలను ఉపయోగిస్తే తప్ప భద్రపరచడం గాని, తీయడం గానీ జరగదు. ఇంతటి పకడ్బందీ వ్యవహారం ఉండే బ్రాంచ్‌లలో దాదాపు 7కిలోల బంగారం పక్కదారి పట్టిందంటే ఇందులో చాలామంది ప్రమేయం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి బ్రాంచ్‌లో ఏం జరిగినా సంబంధిత మేనేజర్‌ బాధ్యత ఉంటుంది. దానితో పాటు ఉన్నతాధికారుల పరిశీలన ఉంటుంది. ఎన్నో సేఫ్‌లలో ఉన్న బంగారం పెద్ద ఎత్తున మాయమవ్వడంతో బ్రాంచ్‌ పర్యవేక్షణ డొల్లతనం బయటపడింది. 

ఎలా బయటకు వచ్చింది..  
గార బ్రాంచిలో బంగారం ఆభరణాలు కుదవ పెట్టిన ఖాతాల బ్యాగులు 2500 వరకు ఉన్నట్టు సమాచారం. అందులో 86 బ్యాగులలో ఉన్న బంగారు ఆభరణాలు మాయమమ్యాయి. ఓ ఖాతాదారు బ్యాంకుకు తనఖా పెట్టిన బంగారం విడిపించేందుకు వెళ్లగా బంగారం కనబడటం లేదని సమాధానం రావడంతో వ్యవహారం బయటికొచ్చింది. దాంతో అదే రోజు సాయంత్రం మరికొందరు ఖాతాదారులు బ్యాంకు వద్దకు చేరి విషయమై మేనేజరు సీహెచ్‌ రాధాకృష్ణ వద్ద అడుగగా రెండు రోజుల్లో చెబుతామని నచ్చ చెప్పి వెనక్కి పంపించారు.

 ఈ నేపథ్యంలో ఆ బంగారు ఆభరణాల రుణాల విభాగం బాధ్యతలు చేపడుతున్న అకౌంటెంట్‌ స్వప్నప్రియను గట్టిగా ప్రశ్నించేసరికి 26బ్యాగులలో ఉన్న రూ. కోటి 75లక్షల బంగారు ఆభరణాలను తెచ్చి ఇచ్చారు. మిగతా 60బ్యాగుల బంగారు ఆభరణాలపై క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 

ఈ ఘటనతో బంగారు ఆభరణాలు గల్లంతు వ్యవహారం మిస్టరీగా మారిపోయింది. అంతవరకు వ్యవహారాన్ని గుట్టుగా ఉంచిన అధికారులు తప్పని పరిస్థితుల్లో గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడా కనిపించని 60బ్యాగుల్లో రూ.4కోట్ల 7లక్షల విలువైన 7కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇవి ఎవరి చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి. కీలకమైన వ్యక్తి చనిపోవడంతో దీంట్లో ఉన్న పాత్రధారులెవరో తేలాల్సి ఉంది. ఇంతవరకు అంతర్గతంగా తేల్చుకుందామని భావించినా పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎస్‌బీఐ రీజినల్‌ మేనేజర్‌ గార పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

నలుగురిపై ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ కోణంలో పోలీసు అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా,  86బ్యాగుల వ్యవహారం వెలుగు చూడటంతో ఆ బ్రాంచ్‌లో ఉన్న మిగతా తాకట్టు ఆభరణాల బ్యాగులలో ఏవైనా తేడాలున్నాయా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటిపైన కూడా దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. గారలో జరిగిన ఘటనతో మిగతా ఎస్‌బీఐ బ్రాంచ్‌లలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర బ్యాంకులు కూడా అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. తమ బ్యాంకుల్లో ఉన్న బంగారు ఆభరణాల భద్రతపై ఆరా తీస్తున్నట్టు సమాచారం.   

స్టేట్‌బ్యాంకులో 7 కేజీల బంగారం మాయం 
గార: మండల కేంద్రంలోని స్టేట్‌బ్యాంకులో 7 కిలోల బంగారం మాయమైందని ఫిర్యాదు వచ్చిందని స్థానిక సీఐ ఎన్‌.కామేశ్వరరావు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో తనఖా పెట్టిన బంగారంలో ఏడు కిలోలు కనిపించడం లేదని, కొందరు బ్యాంకు సిబ్బందిపై అనుమానం ఉందని గురువా రం బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌ రాజు ఫిర్యాదు చేశారని సీఐ పేర్కొన్నారు. బంగారం విలువ రూ. 4 కోట్ల 70 లక్షల పైనే ఉంటుందని తెలిపారు. అదేవిధంగా బ్యాంకు అకౌంటెంట్‌ ఉరిటి స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, బంగారం మాయంపై ఆమె పాత్రపై కూడా విచారణ చేస్తామన్నారు. దీనిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గురువారం ఉదయం నుంచి గార పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు విషయమై ఇన్‌చార్జి డీఎస్పీ విజయకుమార్, శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ ఎన్‌.సన్యాసినాయుడు, బ్యాంకు ఆర్‌ఎం రాజు, గార బ్రాంచి మేనేజర్‌ సీహెచ్‌ రాధాకృష్ణతో మాట్లాడారు.  

సీసీ ఫుటేజీలే కీలకం.. 
బ్యాంకులో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం మాయమయ్యే సమయంలో లాక్‌రూంలో ఉన్న సీసీ పుటేజీలే ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నాయి. ఇప్పటికే బ్యాంకు అధికారులు ఈ పుటేజీలు గమనించారని తెలుస్తోంది. బ్యాంకులో 2500 మంది బంగారం తనఖా పెట్టిన ఖాతాదారులుండగా, వీరిచ్చిన బంగారానికి ఒక్కో ఖాతాకు ఒక్కో బ్యాగు సిద్ధం చేస్తారు. ఈ బ్యాగుల్లో తొలుత 86 మాయమయ్యాయని అధికారులు గుర్తించగా, వీటిలో 26 బ్యాగులను అకౌంటెంట్‌ స్వప్నప్రియ మూడు రోజు ల కిందట బ్యాంకు అధికారులకు అందించినట్టు తెలిసింది. మిగిలిన 60 బ్యాగుల వివరాలు ఆధారంగా 7 కేజీల బంగారం ఆభరణాలు మాయమయ్యాయమని నిర్ధారించారు. నవంబర్‌ 24వ తేదీన బంగారం మాయమైందన్న ఆరోపణలు రాగా ఇప్పటివరకు అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై ఆర్‌ఎం రాజును ప్రశి్నస్తే సమాధానం దాట వేశారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement