సాక్షి, అమరావతి, ధవళేశ్వరం, చింతూరు/దేవీపట్నం: గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉప నదులు ఉప్పొంగుతుండటంతో అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి చూసి జనం హడలిపోతున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, అధికారులు ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వర్షాలు తెరపి ఇవ్వడంతో ఎగువన గోదావరిలో వరద ఉధృతి తగ్గినప్పటికీ రానున్న 24 గంటలు కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి.
మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించాయి. దాంతో గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద 24,29,246 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. దాంతో నీటి మట్టం 71 అడుగులకు చేరుకుంది. 32 ఏళ్ల క్రితం అంటే.. 1990 ఆగస్టు 24న గోదావరికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు భద్రాచలంలో వరద నీటి మట్టం 70.8 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు 32 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ గోదావరి విశ్వరూపం ప్రదర్శిస్తుండటం గమనార్హం. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద వరద మట్టం 72 అడుగులకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గంట గంటకూ పెరుగుతున్న వరద
ఎగువ నుంచి పోలవరం ప్రాజెక్టులోకి వచ్చే వరద గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు 20,00,162 క్యూసెక్కులు చేరుతుండటంతో పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 37.7 మీటర్లకు చేరుకుంది. గంట గంటకూ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో పోలవరం వద్ద అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. శనివారం రాత్రికి 28.50 లక్షల నుంచి 30 లక్షల క్యూసెక్కుల వరద పోలవరంలోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. కాగా, శుక్రవారం ఉదయం 9.40 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలో వరద మట్టం 17.75 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి 21,78,427 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దాంతో నీటి మట్టం 19.3 అడుగులకు చేరుకుంది. గోదావరి డెల్టాకు 10,000 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 21,68,427 క్యూసెక్కుల నీటిని కడలిలోకి వదిలేస్తున్నారు.
ఎగువన శాంతిస్తున్న గోదావరి
పరివాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదారమ్మ శాంతిస్తోంది. శుక్రవారం రాత్రి 9 గంటలకు శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరద 96,265 క్యూసెక్కులకు తగ్గింది. ఎల్లంపల్లిలోకి వస్తున్న వరద 2,94,429, లక్ష్మీ బ్యారేజీలోకి చేరుతున్న వరద 23,29,903 క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ నుంచి విడుదల చేస్తున్న వరదతో సమ్మక్క బ్యారేజ్‌లోకి 24,21,180 క్యూసెక్కులు చేరుతోంది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సీతమ్మసాగర్‌లోకి 23,94,567 క్యూసెక్కులు చేరుతుండగా, అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజ్ వద్ద విడుదల చేసిన వరద.. ధవళేశ్వరం బ్యారేజ్‌కు చేరుకోవడానికి 48 గంటలు పడుతుంది. కాటన్ బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరో 48 గంటలపాటు గోదావరి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగుతుందని అంచనా వేసిన ప్రభుత్వం.. గోదావరి బేసిన్‌లో హైఅలర్ట్‌ను ప్రకటించింది.
వందలాది గ్రామాలు నీట మునక
వరద గోదావరి ఊళ్లను ముంచెత్తి ప్రవహిస్తోంది. 1986 తర్వాత గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరద నీరు కారణంగా పోలవరం ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, ఎటపాక, వి.ఆర్.పురం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలుగు మండలాల్లో వరదనీరు చుట్టుముట్టడంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కూనవరం, వీఆర్.పురం మండలాలు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకోగా చింతూరు, ఎటపాక గ్రామాల్లో నది పరీవాహక గ్రామాలను వరద ముంచెత్తింది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ వద్ద బ్యాక్ వాటర్ పోటు కారణంగా పోశమ్మగండి వద్ద వరద నీరు కొండను తాకింది. దేవీపట్నం మండలంలో కొండమొదలు పంచాయతీలోని కత్తనాపల్లి, కొత్తగూడెం, తాళ్లూరు గ్రామస్తులు కొండలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని సురక్షిత ప్రదేశాల్లో తల దాచుకుంటున్నారు. వీరికి శుక్రవారం దుప్పట్లు, టార్పాలిన్లు, కూరగాయాలు తదితర నిత్యావసరాలు పంపించినట్టు తహసీల్దార్ వీరభద్రరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment