ఏయూలో జియోలాజికల్‌ ఎగ్జిబిషన్‌

Geological Exhibition at Andhra University - Sakshi

ఆకట్టుకున్న శిలలు, ఖనిజాల ప్రదర్శన

ఏయూ క్యాంపస్‌: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ విభాగంలో ఏయూ, ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ (ఇంటాక్‌) విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన జియోలాజికల్‌ ఎగ్జిబిషన్‌ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది.

ఇందులో అరుదైన శిలాజాలను సేకరించే అలవాటు కలిగిన కందుల వెంకటేష్‌ కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న చేప శిలాజం, నత్త గుల్లలు, శంఖాలను, డైనోసార్ల శిలాజాలను, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన జీవుల శిలాజాలను, అంతరిక్షం నుంచి భూమిని ఢీకొట్టిన ఉల్క శకలం, భూమి లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన అరుదైన, అందమైన ఖనిజాలను ప్రదర్శించారు.

ప్రముఖ ఛాయాచిత్ర గ్రాహకుడు బీకే అగర్వాల్‌ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జియో డైవర్సిటీ కలిగిన ప్రాంతాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏయూ రెక్టార్‌ ఆచార్య కె.సమత మాట్లాడుతూ శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థుల్లో ఉత్సుకతను కలిగిస్తుందన్నారు.

సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఈ ఎగ్జిబిషన్‌లో అరుదైన మినరల్స్, శిలలు ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే అరుదైన శిలలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం విద్యార్థులకు ఏర్పడిందన్నారు.

ఇంటాక్‌ విశాఖ కన్వీనర్‌ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. యునెస్కో అక్టోబర్‌ 6 ను ఇంటర్నేషనల్‌ జియో డైవర్సిటీ డేగా ప్రకటించిందని వెల్లడించారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top