డిసెంబ‌రు 22 నుండి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ | Free Tokens Issuing TTD Allows Vaikuntha Ekadashi darshans | Sakshi
Sakshi News home page

డిసెంబ‌రు 22 నుండి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ

Dec 20 2023 8:44 AM | Updated on Dec 20 2023 1:16 PM

Free Tokens Issuing TTD Allows Vaikuntha Ekadashi darshans - Sakshi

తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో డిసెంబ‌రు 23 నుండి జ‌న‌వ‌రి 1వ తేదీ వ‌ర‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నానికి సంబంధించి డిసెంబ‌రు 22వ తేదీ మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుండి తిరుప‌తిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంట‌ర్ల ద్వారా స‌ర్వ‌ద‌ర్శ‌నం టైంస్లాట్ టోకెన్లు మంజూరు చేస్తామ‌ని టీటీడీ జేఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి తెలిపారు. కౌంట‌ర్ల‌ను మంగ‌ళ‌వారం ఆమె త‌నిఖీ చేశారు. 


 
ఈ సంద‌ర్భంగా జేఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుప‌తిలోని విష్ణునివాసం, శ్రీ‌నివాసం, గోవింద‌రాజ‌స్వామి స‌త్రాలు, భూదేవి కాంప్లెక్స్‌, రామచంద్ర పుష్క‌రిణి, ఇందిరా మైదానం, జీవ‌కోన హైస్కూల్‌, బైరాగిప‌ట్టెడ‌లోని రామానాయుడు హైస్కూల్‌, ఎంఆర్ ప‌ల్లిలోని జడ్‌పి హైస్కూల్‌లో కౌంట‌ర్లు ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. ఈ కౌంట‌ర్ల‌లో 4 ల‌క్ష‌లకు పైగా స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల కోటా పూర్త‌య్యేవ‌ర‌కు మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డించారు. కౌంట‌ర్ల వ‌ద్ద ప్ర‌త్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామ‌ని, వేచి ఉండే భ‌క్తుల‌కు తాగునీరు, అల్పాహారం, టీ, కాఫీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని వివ‌రించారు. టోకెన్లు, టికెట్లు పొందిన భ‌క్తుల‌ను 24 గంటలు ముందు మాత్ర‌మే తిరుమ‌లకు అనుమ‌తిస్తామ‌న్నారు.

ద‌ర్శ‌న టోకెన్లు ఉన్న‌వారిని మాత్ర‌మే తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని, టోకెన్లు లేని భ‌క్తులు తిరుమ‌ల‌కు వెళ్ల‌వ‌చ్చు గానీ ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌బ‌డ‌ర‌ని, ఈ విష‌యాల‌ను కౌంట‌ర్ల వ‌ద్ద అనౌన్స్‌మెంట్ చేస్తామ‌ని చెప్పారు. తిరుప‌తిలోని అన్ని కౌంట‌ర్ల వ‌ద్ద‌ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామ‌ని, త్వద్వారా భ‌క్తులు ఇత‌ర ప్రాంతాల్లోని కౌంట‌ర్ల‌కు సులువుగా చేరుకోవ‌డానికి వీలు క‌లుగుతుందని చెప్పారు. స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల స‌మాచారం తెలుసుకుని ప్రణాళిక ప్రకారం తిరుమ‌ల‌కు వ‌చ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులుకావాల‌ని కోరారు.
 
జేఈవో వెంట ఎస్ఈలు శ్రీ స‌త్య‌నారాయ‌ణ, శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవింద‌రాజ‌న్‌, శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఐటి జిఎం శ్రీ సందీప్‌, అద‌న‌పు ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌కుమార్‌, ఎవిఎస్వో శ్రీ నారాయ‌ణ త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement