ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు

Four MLCs Takes Oath In AP Legislative Council Over Governor Quota - Sakshi

సాక్షి, అమరావతి: గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన నలుగురు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు లేళ్ల అప్పిరెడ్డి, తోట త్రిమూర్తులు, మోషేన్‌రాజు, రమేష్ యాదవ్‌లు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో సోమవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ప్రొటెం చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం నూతన ఎమ్మెల్సీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు శ్రీ రంగనాథరాజు, అనిల్ కుమార్ యాదవ్, తానేటి వనిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు పాల్గొన్నారు. గవర్నర్‌ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇటీవల ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఎమ్మెల్సీల నేపథ్యం:

లేళ్ల అప్పిరెడ్డి: గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలేనికి చెందిన లేళ్ల అప్పిరెడ్డి సామాన్య రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. విద్యార్థి, యువజన, కార్మిక నేతగా ప్రజలకు దగ్గరయ్యారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాలం నుంచి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి వైస్‌ జగన్‌ అడుగుజాడల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

మోషేన్‌రాజు: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మోషేన్‌రాజు.. వైఎస్‌ జగన్‌ పార్టీని ప్రకటించిన మరుక్షణమే కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్బంధకాండలోనూ వైఎస్‌ జగన్‌తో కలిసి ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 

తోట త్రిమూర్తులు: తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపంలోని వెంకటాయపాలెంకు చెందిన తోట త్రిమూర్తులు మండపేట అసెంబ్లీ నియోజకవర్గం పార్టీ సమన్వయకర్తగా ఉన్నారు. కాపులకు తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇచ్చారు. 

రమేష్‌యాదవ్‌: కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన రాజగొల్ల రమేష్‌యాదవ్‌ ఉన్నత విద్యావంతుడు. విదేశీ విద్యా సంస్థలతో ఆయన మంచి సంబంధాలున్నాయి. ఆయన తండ్రి కూడా రాజకీయాల్లో కొనసాగారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

చదవండి: ఏపీ రికార్డ్‌: ఒక్కరోజే 13 లక్షల మందికి వ్యాక్సినేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top