‘ఏం పిల్లడో’ ఎల్లిపోయావా

Folk artist Vangapandu Prasad rao departed - Sakshi

జానపద శిఖరం, ప్రజా గాయకుడువంగపండు ఇకలేరు

ప్రభుత్వ లాంఛనాలతో, విప్లవ గీతాల మధ్య అంత్యక్రియలు 

ఏపీ, తెలంగాణ సీఎంల సంతాపం 

సాక్షి, అమరావతి:  ‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’ అంటూ  ఊరించి.. ఉరిమించి ఊరూవాడా ఏకం చేసి కవ్వించి.. కదం తొక్కించి..చెప్పకుండానే ఎల్లిపోయాడు..‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా’.. అంటూ ప్రజలను చైతన్యం చేసిన ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు (77) ఇకలేరు. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్‌లో మంగళవారం వేకువజామున ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వంగపండుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పదునైన పదాలకు సొంపైన బాణీలతో స్వయంగా కాలికి గజ్జె కట్టి ఆడి పాడే వంగపండు శ్రీకాకుళం గిరిజన, రైతాంగ పోరాటం నుంచి ఉద్భవించిన వాగ్గేయకారుడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు సబ్‌ కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వరులు దగ్గరుండి ప్రభుత్వ లాంఛనాలతో  అధికారికంగా వంగపండు అంత్యక్రియలను పూర్తి చేశారు. 

విప్లవ గీతాలకు పెట్టింది పేరు 
1943 జూన్‌లో పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో జగన్నాథం, చినతల్లి దంపతులకు వంగపండు జన్మించారు. తన రచనలతో, పాటలతో ప్రజలను చైతన్యం చేశారు. 1972లో నాటి పీపుల్స్‌ వార్‌ సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించి 400కి పైగా జానపద గీతాలను రచించారు.అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో వంగపండు రచించిన గీతాలను ఆలపిస్తూ విప్లవ జ్యోతికి తుది వీడ్కోలు పలికారు. వంగపండు కుమార్తె ఉష వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. రాష్ట్ర çసృజనాత్మక, సాంస్కృతిక కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గా సేవలందిస్తున్నారు. తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఆమె పార్వతీపురం చేరుకున్నారు. తండ్రితో కలసి పలు ప్రదర్శనల్లో పాల్గొని విప్లవ గీతాలతో చైతన్యం రగిల్చారు. ఆ గుర్తులను తలచుకుని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.

ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతి..: జగన్‌ 
ప్రజా గాయకుడు, కవి వంగపండు ప్రసాదరావు మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘‘పామును పొడిచిన  చీమలు’’న్నాయంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఆయన ఓ మహాశిఖరంగా నిలిచిపోతారు. వంగపండు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా’’ అని సీఎం ట్వీట్‌ చేశారు.
  
సీఎం కేసీఆర్‌ సంతాపం 
సాక్షి, హైదరాబాద్‌: ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు వంగపండు ప్రసాదరావు మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజల బాధలు, సమస్యలు, ప్రజా ఉద్యమాలే ఇతివృత్తంగా పాటలు రాసి, పాడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి వంగపండు జీవితాంతం పాటుపడ్డారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top