పూలు విలవిలలాడేనని.. | Flower Prices Have Fallen In The Market In The Past Few Days, Know More Details Inside | Sakshi
Sakshi News home page

పూలు విలవిలలాడేనని..

Jan 30 2025 5:52 AM | Updated on Jan 30 2025 11:04 AM

Flower prices have fallen in the market in the past few days

సగానికి పైగా తగ్గిన ధరలు

మరోవైపు గణనీయంగా దిగుబడి

రేటు లేక తోటల్లోనే వదిలేస్తున్న రైతులు

ఉపాధి దొరకక కూలీలు, మహిళలకు ఇబ్బందులు  

పెరవలి: కొద్ది రోజులుగా మార్కెట్‌లో పూల ధరలు పడిపోవటంతో రైతులు విలవిలలాడుతున్నారు. మరోవైపు పూలకోత కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో కడియపులంక తరువాత చెప్పుకోదగిన కాకరపర్రు పూల మార్కెట్టు నేడు పూలు కొనేవారు లేక కళావిహీనంగా కనిపిస్తోంది.

ప్రస్తుతం శుభ ముహూర్తాలు, పండగలు లేకపోవటంతో పూల వినియోగం తక్కువగా ఉందని, అందువల్లనే ధరలు తగ్గాయని చెబుతున్నారు. దిగుబడి ఉన్నా తగినంత ధర లేక రైతులు.. ఉపాధి దొరకక కూలీలు.. అమ్మకాలు లేక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. 

ధరలు పడిపోయాయిలా.. 
ఇరవై రోజుల క్రితం కిలో చామంతి, జాజుల ధర రూ.300 పలికింది. నేడు పూల నాణ్యతను బట్టి కిలో రూ.60 నుంచి రూ.120కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అవి కూడా వ్యాపారుల వద్ద రెండు మూడు రోజుల పాటు నిల్వ ఉండిపోతున్న పరిస్థితి. 

అప్పటికీ అమ్ముడుపోకపోతే పూలు పాడైపోవడంతో గత్యంతరం లేక వాటిని నాలుగో రోజున రోడ్ల పక్కన పారబోస్తున్నామని వ్యాపారులు వాపోతున్నారు. పూల మాలలు అల్లించడం, గ్రేడింగ్‌ వంటి పనులు చేయిద్దామన్నా కనీస కూలి ఖర్చులు కూడా రావడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు.
 
కూలీలకు పనులు కరవు 
పూల సాగు, వ్యాపారానికి సంబంధించి కూలీలు రకరకరాల పనులు చేస్తూ ఉపాధి పొందుతూంటారు. సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై ఇంటింటికీ పూలు అమ్ముకునే చిరు వ్యాపారులు కూడా ఉంటారు. నిత్యం పూల కోత కోసే కూలీలకు వారానికి ఒక్క రోజు మాత్రమే పని లభిస్తోంది. అలాగే, పూల దండలు కట్టే మహిళలు కూడా దండలు కట్టే పనుల్లేక ఆదాయం కోల్పోతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement