
శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 93,115 క్యూసెక్కుల వరద నీరు
రేపు క్రస్ట్ గేట్లు ద్వారా నీరు విడుదల చేసే అవకాశం ?
సాక్షి, నరసరావుపేట: కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు వరదప్రవాహం కొనసాగుతోంది. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, 312.045 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఆదివారం సాయంత్రానికి నీటిమట్టం 582.90 అడుగులు వద్ద ఉండగా, నీటి నిల్వ 291.3795 టీఎంసీలకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు 93,115 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 66,417 క్యూసెక్కులు, స్పిల్ వే ద్వారా మరో 26,698 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. కాలువల ద్వారా 35,749 క్యూసెక్కులు కిందకు వదలుతున్నారు. మరో 20 టీఎంసీల నీరు వస్తే నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుతుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఆదివారం సాయంత్రానికి ప్రాజెక్టు నీటిమట్టం 24.08 టీఎంసీలకు చేరింది. ఎగువనుంచి పులిచింతలకు 26,430 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
రేపు క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల
కృష్ణానదిలో ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటం, ప్రాజెక్టు నీటి మట్టం ఇప్పటికే 583 అడుగులకు చేరింది. దీంతో మంగళవారం నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు విడుదల చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పోటెత్తిన తుంగభద్ర
నీట మునిగిన పంట పొలాలు
కౌతాళం/హొసపేటె : కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఆదివారం పోటెత్తింది. నదితీరంలో అర కిలోమీటర్ మేర పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కర్ణాటకలోని హోస్పేట్ టీబీ డ్యాం నుంచి శనివారం రాత్రి తుంగభద్ర నదికి 92వేలు క్యూసెక్కులు నీరు వదలగా అవి ఆదివారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా సరిహద్దుకు చేరాయి. అప్పటికే రైతులు అప్రమత్తమై తమ వ్యవసాయ విద్యుత్ మోటార్లు, పైపు లైన్లను సురక్షిత ప్రాంతానికి తరలించుకున్నారు.
నీటి ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో తీర గ్రామాల రైతులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కౌతాళం మండలం కుంబళనూరు వద్ద వరి పైర్లు వేసి పక్షం రోజులు అవుతుండడంతో తమ పంటలపై ఎక్కడ ఇసుక మేట వేస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.
నిలిచిపోయిన రాకపోకలు
తుంగభద్ర నదిలో ప్రవాహం పెరగడంతో కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెళ్లేకుడ్లూరు–మేళిగనూరు మధ్య రవాణా సౌకర్యం నిలిచిపోయింది. దీనితో పాటు కుంబళనూరు వద్ద కూడా వంకకు నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మండ్య జిల్లాలో కావేరి నది కూడా ఉప్పొంగుతోంది. కేఆర్‌ఎస్ డ్యాం నుంచి భారీగా నీటిని విడుదల చేశారు.