ఏపీలో తొలి పైలెట్‌ శిక్షణా కేంద్రం

First Pilot Training Center In AP - Sakshi

కర్నూలు ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో తొలి పైలెట్‌ శిక్షణా కేంద్రం కర్నూలులో ఏర్పాటు కానుంది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు దగ్గరగా ఉండటం, కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ పైలెట్‌ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ఎండీ వి.ఎన్‌.భరత్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు. త్వరలోనే ఈ కేంద్రానికి సంబంధించి ఫైనాన్షియల్‌ బిడ్లు పిలవనున్నట్టు తెలిపారు. ఈ శిక్షణా కేంద్రానికి సంబంధించిన మౌలిక వసతులను ఆ సంస్థే సమకూర్చుకోవాలని, కర్నూలు ఎయిర్‌పోర్ట్‌ ల్యాండ్‌ను వినియోగించుకున్నందుకు ఏపీఏడీసీఎల్‌కు అద్దె చెల్లించాల్సి ఉంటుందన్నారు. 

ఆయన ఇంకా చెప్పారంటే..
కేంద్ర పౌర విమానయాన సంస్థ నుంచి అనుమతులు వస్తే కర్నూలు ఎయిర్‌పోర్టును విజయదశమికి అందుబాటులోకి తీసుకువస్తాం.
కర్నూలు నుంచి ఉడాన్‌ పథకం కింద చౌక విమాన సర్వీసులు నడపడానికి ట్రూజెట్‌ మూడు రూట్లు దక్కించుకుంది. కర్నూలు నుంచి విజయవాడ, విశాఖ, బెంగళూరు నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది.
ప్రస్తుతం పగటి పూట మాత్రమే విమానాలు నడుపుతారు. రెండవ దశలో రాత్రి వేళ కూడా సర్వీసులు ప్రారంభిస్తారు.
సుమారు 970 ఎకరాల్లో రూ.160 కోట్లతో ఏపీఏడీసీఎల్‌ కర్నూలు ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2 వేల మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top