పరవాడ ఫార్మాసిటీ ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Fire Incident Parawada Pharma City - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్‌లో సోమవారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగాగాయపడిన మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు.

ఈ ప్రమాదంపై పరవాడ పోలీసులు తెలిపిన మేరకు.. లారస్‌ పరిశ్రమ యూనిట్‌–3లో మ్యానుఫ్యాక్చరింగ్‌ బ్లాక్‌–6లో డ్రైమర్‌ రూమ్‌ను మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన బి.రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేష్‌బాబు, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడకు చెందిన రాపేటి రామకృష్ణ,  చోడవరం మండలం పెన్నవోలు గ్రామానికి చెందిన మజ్జి వెంకటరావు, విజయనగరం జిల్లాకు నెల్లిమర్లకు చెందిన ఎడ్ల సతీష్‌ శుభ్రం చేస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఫ్లాష్‌ఫైర్‌ సంభవించింది. అగ్ని ప్రమాదం జరిగిన గది మొత్తం రబ్బరుతో నిండి ఉంది.

నిప్పురవ్వలు పడి రబ్బరు నిల్వలు అంటుకోవడంతో గది అంతా మంటలు, దట్టమైన పొగతో నిండిపోయింది. గదిలో ఉన్న ఐదుగురు కారి్మకులు మంటల్లో చిక్కుకుపోయారు. వెంటనే పరిశ్రమకు చెందిన అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపుచేసి గాయపడినవారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మార్గంమధ్యలోనే బి.రాంబాబు (32), రాజేష్‌బాబు (36), రాపేటి రామకృష్ణ (32), మజ్జి వెంకటరావు (36) మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్‌ మార్చురికీ తరలించారు.

ఎడ్ల సతీష్‌ (36) నగరంలోని కిమ్స్‌ ఐకాన్‌ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అగ్నిప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పరవాడ సీఐ పి.ఈశ్వరరావు, ఎస్‌ఐ తేజేశ్వరరావు అక్కడికి చేరుకున్నారు. ప్రమాదస్థలాన్ని అనకాపల్లి ఎస్పీ గౌతమిశాలి సోమవారం రాత్రి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు చేపట్టాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్‌ చేశారు.

మృతుల కుటుంబాలకు పరిహారం 
పరవాడలోని లారస్‌ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలను, ఇక్కడి పరిస్థితి ఆయన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలియజేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారని మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కార్మికుడికి వైద్యసహాయం అందించాలని వైద్యాధికారులను, ప్రమాదానికి కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్, ఎస్పీలను మంత్రి ఆదేశించారు.

మృతులు వీరే.. 
బి.రాంబాబు (32) ఖమ్మం జిల్లా, రాజేష్‌బాబు (36) గుంటూరు జిల్లా, రాపేటి రామకృష్ణ (32) అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం చౌడువాడ, మజ్జి వెంకటరావు (36) చోడవరం మండలం పెన్నవోలు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top