మాకొద్దీ మాయదారి మద్యం | Sakshi
Sakshi News home page

మాకొద్దీ మాయదారి మద్యం

Published Sun, Aug 6 2023 4:18 AM

Fine for drinking alcohol - Sakshi

పలమనేరు/బైరెడ్డిపల్లి (చిత్తూరుజిల్లా) : చిత్తూ­రు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం మేకల మాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మద్యం తాగకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎవరు అతిక్రమించినా జరిమానాతో పా­టు గ్రామ బహిష్కరణ చేయాలని సర్పంచ్‌తో కలిసి నిర్ణయం తీసుకున్నారు. మేకల మాగిరెడ్డిపల్లిలో మొత్తం 270 కుటుంబాలు, రెండు వేల దాకా జనాభా ఉన్నారు.

దాదాపు అందరికీ కూలీనాలీయే జీవనాధారం. అయితే కొన్నాళ్లుగా కొందరు కర్ణాటక టెట్రాప్యాకెట్లను తెచ్చి గ్రామంలో అమ్ముతున్నారు. దీంతో యువకులు మద్యానికి బానిసలై  కుటుంబాలకు భారంగా మారారు. దీన్ని గమనించిన సర్పంచ్‌ బాలకృష్ణ గ్రామ పెద్దలతో చర్చించి వారం రోజుల కిందట పంచాయితీ పెట్టించారు. తమ గ్రామం బాగుపడాలంటే ఊర్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.

మద్యం తాగినా, కర్ణాటక నుంచి ఎవరైనా మద్యం తెచ్చి అమ్మినా వారికి రూ.20 వేల జరిమానాతో పాటు, గ్రామ బహిష్కరణ చేయాలని తీర్మానించారు. ఫలితంగా గ్రామంలో వారం నుంచి మద్య పానం ఆగిపోయింది. అమ్మకాలు నిలిచిపోయాయి.   

అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.. 
మా గ్రామంలో చాలామంది మద్యానికి బానిసలైపోవడంతో కలత చెందాం. దీంతో పాటు కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్లను తెచ్చి విక్రయించేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో గ్రామంలో యువకులు చెడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.   
– బాలకృష్ణ, సర్పంచ్, ధర్మపురి పంచాయతీ

Advertisement

తప్పక చదవండి

Advertisement