పెండలం దుంప సాగుతో ఊహించని లాభాలు.. ఎకరాకు ఆదాయం ఆదాయం ఎంతంటే?

Farmers Profit From Pendalam Dumpa Cultivation - Sakshi

దేవరపల్లి(పశ్చిమగోదావరి): కష్టాన్ని నమ్ముకున్న రైతుకు ఈ ఏడాది పెండలం దుంప సాగు ఊహించని లాభాలు తెచ్చింది. జూలైలో పంట విక్రయించిన వారికి కాసులు కురిపిస్తోంది. ఈ పంట దిగుబడులు తగ్గినా ధర బాగుండడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మెట్ట ప్రాంతంలోని నల్లరేగడి భూముల్లో పెండలం దుంపను ఎక్కువగా సాగు చేస్తున్నారు. జిల్లాలోని దేవరపల్లి మండలం పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో, కొవ్వూరు మండలం పెనకలమెట్ట, దొమ్మేరు, వాడపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా పెండలం సాగు జరుగుతోంది.
చదవండి: ఈ మొక్కలు పెంచితే ఎంత డేంజరో తెలుసా?

పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో దాదాపు 25 ఏళ్లుగా పెండలం సాగు చేసి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందారు. మూడు  గ్రామాల్లో సుమారు 220 ఎకరాల విస్తీర్ణం ఉంది. ఖరీఫ్‌లో పంట వేయగా, జనవరి, ఫిబ్రవరి నెలల్లో దుంప తయారు అవుతోంది. మే, జూన్, జూలై నెలల్లో ఎగుమతి చేస్తారు. ఒక్కో దుంప రెండు నుంచి 5 కిలోల బరువు ఉంటోంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుంది.

రికార్డు స్థాయిలో ధర
ప్రస్తుతం పెండలం ధర రికార్డు స్థాయిలో ఉంది. మొన్నటి వరకూ టన్ను ధర రూ.10 వేల నుంచి రూ.15 వేల ఉండగా, జూలైలో రికార్డు స్థాయికి చేరింది. టన్ను ధర రూ.39 వేలు పలుకుతోంది. ధర పెరగడంతో పెండలం సాగు చేసిన రైతులకు లాభాలు వస్తున్నాయి. ఈ ధర గతంలో ఎన్నడూ లేదని వారంటున్నారు. అయితే అమ్మకాలు ముమ్మరంగా ఉన్న సమయంలో టన్ను ధర రూ.15 వేలు పలకడంతో ముందుగా అమ్ముకున్న రైతులు నష్టపోయారు. ఈ నెలలో విక్రయించిన రైతులకు ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వచ్చింది.

పల్లంట్ల దుంపకు డిమాండ్‌
దేవరపల్లి మండలం పల్లంట్లలో పండించిన పం టకు మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. దుంప సైజు, నాణ్యత ఉంటుంది. 2 కిలోల నుంచి 5 కిలోలు దుంప తయారు అవుతుంది. దుంప పంట కావడంతో భూమిలో పెరుగుతుంది. దుంప తయా రైన తర్వాత భూమిలో నుంచి దుంపను తవ్వితీసి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. పెండలం పంట సాగుకు పెట్టుబడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఎకరం కౌలు రూ.50 వేలు ఉండగా, పెట్టుబడి మరో రూ.70 వేలు అవుతుంది. ఈ ఏడాది పెట్టుబడులు ఎక్కువ కావడంతో నిఖర ఆదాయం  తగ్గిందని రైతులు తెలిపారు.

ఒడిశాకు ఎగుమతులు
జిల్లాలో పండించిన పెండలం దుంపను ఒడిశాకు ఎగుమతి చేస్తున్నారు. ఒడిశాలో పెండలాన్ని ఎక్కువగా వినియోగిస్తారు. వివాహాలు, శుభకార్యాల సమయంలో పెండలాన్ని ఇంటింటికీ 10 కిలోల చొప్పున సారెగా పంపిణీ చేస్తారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలేనికి చెందిన  వ్యాపారులు పల్లంట్ల పరిసర గ్రామాలకు వచ్చి దుంపను కొనుగోలు చేసి ఎగుమతి చేస్తుంటారు. పది టన్నుల లారీ రూ.3.90 లక్షలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు వివరించారు.

మార్కెట్లో ధర పెరిగింది..
పెండలం దుంపకు మార్కెట్‌ బాగుంది. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో సుమారు 100 మంది రైతులు దాదాపు 220 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రెండేళ్లు మార్కెట్‌ బాగోక  నష్టపోయారు. గత ఏడాది 10 టన్నుల ధర రూ.70 వేలు ఉండగా, ఈ ఏడాది రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు పలికింది. ప్రస్తుతం రూ.3.90 లక్షలు వస్తోంది. దిగుబడులు తగ్గడంతో పెండలానికి డిమాండ్‌ ఏర్పడింది. నెల రోజుల నుంచి మార్కెట్లో ధర పెరిగింది. 
– నలమాటి బాలకృష్ణ, రైతు, పల్లంట్ల  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top