కాలేజీ యాజమాన్యం వేధించి చంపేసింది.. 

Family Members Protest At Narayana Engineering College - Sakshi

బీటెక్‌ విద్యార్థి మృతిపై కుటుంబసభ్యుల ఆందోళన 

నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద బైఠాయింపు

ఫీజులపై వేధింపులే మృతికి కారణమంటూ ఆవేదన 

హాస్టల్‌ ఫర్నిచర్‌ ధ్వంసం 

గూడూరు: ‘మా బిడ్డ సౌమ్యుడు. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదు. ఫీజుల విషయంలోనే యాజమాన్యం వేధించి చంపేసింది..’ అంటూ తిరుపతి జిల్లా గూడూరులోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి (21) బంధువులు, తల్లిదండ్రులు ఆరోపించారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేముల మండలం నారేపల్లి గ్రామానికి చెందిన ఓబుల్‌రెడ్డి వెంకటకృష్ణారెడ్డి, గంగమ్మ కుమారుడు ధరణేశ్వర్‌రెడ్డి శనివారం అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే.

మృతుడి తల్లిదండ్రులు, బంధువులు ఆదివారం కళాశాల వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డను కళాశాల యాజమాన్యమే చంపేసిందంటూ కళాశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మృతుడి తల్లిదండ్రులు, బంధువుల రోదన అందరినీ కలచివేసింది. కళాశాల యాజమాన్యమే తమ బిడ్డను పొట్టనబెట్టుకుందంటూ విలపించారు. తాము గూడూరు వచ్చేవరకు కూడా ఆగకుండానే మృతదేహాన్ని హాస్టల్‌ గది నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారంటూ కన్నీరుమున్నీరయ్యారు.

తమ బిడ్డను చంపేసి, కుటుంబకలహాల కారణంగానే అంటూ కట్టుకథ అల్లి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో యాజమాన్యం వేధించిందని, తమవద్ద సీసీ కెమెరాల పుటేజీ ఆధారాలున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా మృతుడి  బంధువులు సమీపంలోనే ఉన్న హాస్టల్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.

1వ పట్టణ ఎస్‌ఐ పవన్‌కుమార్, సిబ్బంది వారిని అడ్డుకున్నారు. విచారించి న్యాయం చేస్తామని సర్దిచెప్పారు. నారాయణ విద్యాసంస్థల్లో బలైన ఎందరో విద్యార్థుల్లో తమ బిడ్డ కూడా ఒకడయ్యాడని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు పేర్కొన్నారు. తమకు పోలీసులపై నమ్మకం ఉందన్నారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. 

నారాయణ కళాశాల యాజమాన్యంపై కేసు 
గూడూరు నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల బీటెక్‌ విద్యార్థి ఓబులరెడ్డి ధరణేశ్వర్‌రెడ్డిది అనుమానాస్పద మృతి అని ఆదివారం విద్యార్థి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి విలేకరులకు చెప్పారు.

కళాశాల హాస్టల్లో ఉరేసుకుని చనిపోయిన విద్యార్థి ధరణేశ్వర్‌రెడ్డి చాలా సౌమ్యుడని, చదువులో ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నాడని, విద్యార్థి మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని తల్లిదండ్రులు గూడూరు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విద్యార్థి మృతికి కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top