నకిలీ పోలీస్ డ్రెస్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ శివకిషోర్, చిత్రంలో డీఎస్పీ శ్రావణ్‌కుమార్
ఏలూరు టౌన్: చదివింది పదో తరగతే అయినప్పటికీ, గుంటూరు జిల్లా డీఎస్పీనంటూ ప్రగల్భాలు పలుకుతూ, ఉద్యోగాలు ఇప్పిస్తాననే నెపంతో రూ.26 లక్షలు కాజేసిన ఓ అంతర్రాష్ట్ర నకిలీ పోలీసును ఏలూరు టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిశోర్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, టూటౌన్ సీఐ అశోక్‌కుమార్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కేసు పూర్వాపరాలు
తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీనివాస్ అలియాస్ శ్రీను పదో తరగతి వరకు చదివాడు. గోల్డ్ బిజినెస్ చేస్తున్నానని, గుంటూరు జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నానని నమ్మిస్తూ నిరుద్యోగులను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలను మోసం చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. పోలీసు యూనిఫాంలో హడావుడి చేస్తూ, లగ్జరీ హోటళ్లలో బస చేస్తూ మాయమాటలతో అమాయకులను నమ్మించేవాడు. ఈ క్రమంలోనే ఏలూరుకు చెందిన పాలిక రంగ వీరబాబు నుంచి రూ.18 లక్షలు, దండిపాటి గణేష్ నుంచి రూ.8 లక్షలు వసూలు చేసి, వారికి పోలీసు శాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అనంతరం ఇద్దరికీ నకిలీ నియామక పత్రాలు అందజేయడమే కాకుండా, వారిచేత పోలీసు యూనిఫామ్, బూట్లు, బెల్టు, టోపీ, నేమ్ ప్లేట్లను కూడా కొనుగోలు చేయించాడు. తాము ఉద్యోగం సాధించామని సంబరపడ్డ బాధితులకు, అతడు నకిలీ డీఎస్పీ అని ఆలస్యంగా తెలియడంతో ఏలూరు టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు.
ఏలూరులో చిక్కిన నిందితుడు
బాధితుల ఫిర్యాదు మేరకు క్రైమ్ నంబర్ 227/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు, డీఎస్పీ శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో టూటౌన్ సీఐ అశోక్‌కుమార్, ఎస్సై మధువెంకట రాజా, హెడ్‌కానిస్టేబుల్ రవిచంద్‌లతో కూడిన ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. ఈ బృందం ఈ నెల 11న సాయంత్రం ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్ సమీపంలోని ఒక హోటల్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి రూ.5.50 లక్షల నగదు, నకిలీ అపాయింట్‌మెంట్ ఉత్తర్వులు, పోలీసు శాఖకు చెందిన రబ్బరు స్టాంపులు, పోలీసు యూనిఫామ్, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌పై గతంలో రాజమహేంద్రవరం 2టౌన్, మట్టంపల్లి, సూర్యాపేట, నరసరావుపేట రూరల్, త్రిపురాంతకం, చిలకలూరిపేట పోలీస్‌స్టేషన్లలోనూ ఇదే తరహా కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై బి.మధువెంకట రాజా, హెడ్‌కానిస్టేబుల్ కె.రవిచంద్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.


