ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
33 ఏళ్ల లీజు జీవోకు సవరణలు
ఇక నుంచి 66 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు లీజు
నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనూ 30 సెంట్లు
తిరుపతిలో టీడీపీ కార్యాలయానికి ఖరీదైన రెండెకరాల భూమి
మచిలీపట్నంలో రవాణా శాఖకు కేటాయించిన భూమి రద్దు చేసి మరీ టీడీపీ ఆఫీస్‌కు కేటాయింపు
ఎకరానికి ఏడాది లీజు కేవలం రూ.వెయ్యి మాత్రమే
సాక్షి, అమరావతి: జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాలకు నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను చవకగా 99 ఏళ్ల పాటు లీజుకు కేటాయించేలా చంద్రబాబు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2017లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించాలని, పార్టీలు మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజు పొడిగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పుడు ఆ ఉత్తర్వులకు సవరణలు చేస్తూ ప్రభుత్వ భూముల కేటాయింపు లీజును 66 ఏళ్లకు పెంచుతూ.. పార్టీ మనుగడలో ఉంటే 99 ఏళ్లకు లీజును పొడిగించాలని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్వుల్లో సూచించారు. తాజాగా జారీ చేసిన జీవో ఆధారంగా అధికారంలో ఉన్న పార్టీలు నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి, తమ పార్టీ కార్యాలయాల కోసం 66 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు లీజుకు కేటాయింపులు చేయించుకోనున్నాయి.
ఇదిలా ఉండగా మచిలీపట్నం నార్త్ మండలంలో గతంలో రవాణా శాఖకు కేటాయించిన 1.60 ఎకరాల భూమి కేటాయింపులను రద్దు చేసి, ఇప్పుడు ఆ భూమిని తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయించారు. ఈ భూమిని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి అప్పగించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అలాగే తిరుపతి రూరల్ మండలం అవిలాలలో టీడీపీ కార్యాలయం కోసం ఖరీదైన రెండు ఎకరాల భూమిని 33 ఏళ్ల పాటు లీజుకు కేటాయిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. ఎకరానికి ఏడాదికి రూ.1,000 లీజు చొప్పున కేటాయించారు. ఈ భూమిని తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి అప్పగించాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


