వడివడిగా.. ఉద్యాన పంటల విస్తరణ

Expansion of horticultural crops in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: లాభదాయకం కాని వ్యవసాయ పంటలు పండిస్తున్న రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించి వ్యవసాయ రంగాన్ని పండుగల మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూడేళ్లలో 4.29 లక్షల ఎకరాల్లో కొత్తగా ఉద్యాన పంటలను విస్తరించింది. ఈ ఏడాది 1.34 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణకు కార్యాచరణ రూపొందించి.. ఇప్పటికే లక్ష ఎకరాల్లో విస్తరణ పూర్తి చేసింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 44.88 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. సాగు విస్తీర్ణంలో 39 శాతం రాయలసీమ జిల్లాల్లోనే ఉండటం విశేషం. మన రాష్ట్రం కొబ్బరి, బొప్పాయి, టమోటా సాగులో మొదటి స్థానంలో ఉండగా.. బత్తాయి, అరటి, వంగ, మిర్చి, ఆయిల్‌పామ్‌ పంటల సాగులో రెండో స్థానంలో నిలిచింది. మామిడి, ఉల్లి, జీడిపప్పులో మూడో స్థానంలో కొనసాగుతోంది. 

ఉద్యాన హబ్‌గా అవతరించే లక్ష్యంతో..
రాష్ట్రాన్ని ఉద్యాన హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. బోరు బావుల కింద రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, వరి క్షేత్రాల్లో అరటి, బత్తా­యి, బొప్పాయి, దానిమ్మ, మామిడి వంటి పంటలు పండుతున్నాయి. దక్షిణ కోస్తా జిల్లాల్లో పొగాకు, సుబాబుల్, యూకలిప్టస్‌ స్థానంలో నిమ్మ, బత్తాయి, అరటి, మామిడి, కృష్టా–గోదావరి రీజియన్‌లో మొక్కజొన్న, చెరకుతోపాటు బోరు బావుల కింద వరి స్థానంలో ఆయిల్‌పామ్, కొబ్బరి, కోకో, జామ తోటలు విస్తరిస్తున్నాయి.

ఉత్తర కోస్తా జిల్లాల్లో సరుగుడుతో పాటు బోరు బావుల కింద వరి స్థానంలో ఆయిల్‌పామ్, జీడి మామిడి, కొబ్బరి తోటలను విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది నిర్దేశించిన లక్ష్యం మేరకు లక్ష ఎకరాల్లో కొత్త తోటల విస్తరణకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. వ్యవసాయ పంటలతో పోలిస్తే రెట్టింపు ఆదాయం పొందే అవకాశం ఉన్న ఉద్యాన పంటల వైపు రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు.

పైగా ప్రధానమైన పంటలతో పాటు అంతర పంటలుగా సాగు చేసే అవకాశం ఉద్యాన పంటల్లోనే ఉంది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేయడం ద్వారా అదనపు ఆదాయం ఆర్జించొచ్చు. పైగా ఏ వాతా­వరణంలో అయినా మెజార్టీ ఉద్యాన పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది.

ఉద్యాన పంటల విస్తరణే లక్ష్యం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో లాభదాయకం కాని వ్యవసాయ, వాణిజ్య పంటల స్థానంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహిస్తున్నాం. మూడేళ్లలో 4 లక్షల ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి తీసుకొచ్చాం. ఈ ఏడాది 1.34 లక్షల ఎకరాల్లో విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించాం. ఆ దిశగా వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రాయితీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నాం.
– కె.బాలాజీనాయక్, అదనపు డైరెక్టర్, ఉద్యాన శాఖ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top