Rajahmundry Bus Depot: ఆర్టీసీ బస్‌ రూటు ఎటు?

Excitement Among The Working Classes Over Rajahmundry RTC Region - Sakshi

సాక్షిప్రతినిధి, అమలాపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అతి పెద్ద ఆర్టీసీ రీజియన్‌ రాజమహేంద్రవరం. జిల్లాల పునర్విభజన తరువాత ఈ జిల్లా మూడు జిల్లాలవ్వడంతో  రాజమహేంద్రవరం రీజియన్‌ విభజనపై ఉద్యోగ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రీజియన్‌ కూడా మూడు రీజియన్లు అవుతుందా ? లేకుంటే డిపోల వారీగా విభజన జరుగుతుందా? అనేది ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఆర్టీసీ రీజియన్‌ పనిచేస్తోంది. రీజినల్‌ మేనేజర్‌ రాజమహేంద్రవరంలోనే ఉంటున్నారు.

జిల్లాల విభజనకు ముందున్న రీజియన్‌ పరిధిలో తొమ్మిది డిపోలు ఉన్నాయి. విభజన అనంతరం రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడ్డ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి పశ్చిమగోదావరి జిల్లా నుంచి మూడు నియోజకవర్గాలు  చేరాయి. కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో కొవ్వూరు, నిడదవోలులో డిపోలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండు డిపోలు రాజమహేంద్రవరం రీజియన్‌ పరిధిలోకి రావడంతో డిపోల సంఖ్య 11కు చేరింది. 

విజయవాడకు నివేదిక 
రీజియన్‌ స్థాయిలో 11 డిపోల విభజనపై కసరత్తు మొదలైంది. జిల్లాల పునర్విభజన తరువాత కోనసీమ జిల్లా పరిధిలోకి నాలుగు ఆర్టీసీ డిపోలు (అమలాపురం, రాజోలు, రావులపాలెం, రామచంద్రాపురం) వస్తాయంటున్నారు. కాకినాడ జిల్లా పరిధిలోకి మూడు డిపోలు (కాకినాడ, తుని, ఏలేశ్వరం)తీసుకురానున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పడ్డ తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి (రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు) డిపోలు రానున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీలో ప్రాథమికంగా జరిపిన విభజనలో తూర్పుగోదావరి జిల్లాలో మిగిలిన జిల్లాల్లో కంటే ఒక డిపో అదనంగా వచ్చేలా కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని రాజమహేంద్రవరం రీజియన్‌కు రోజూ కోటి రూపాయల పైనే ఆదాయం వస్తోంది. ఇందులో అత్యధికంగా కాకినాడ డిపో పరిధిలో తిరిగే  171 బస్సుల ద్వారా వస్తోంది. ఈ బస్సులు 75,722 కిలోమీటర్లు తిరిగి రూ.26 లక్షల ఆదాయాన్ని 
ఆర్జిస్తున్నాయి. 

ఉద్యోగుల ఎదురుచూపులు 
ఆదాయంలో  మూడో స్థానం రాజమహేంద్రవరం డిపోలో కనిపిస్తోంది. ఈ డిపో పరిధిలో 141 బస్సులు 54,828 కిలోమీటర్లు తిరుగుతున్నాయి. ఫలితంగా రూ.17 లక్షల ఆదాయం వస్తోంది. ఆదాయం, బస్సులు, ఉద్యోగుల సంఖ్య ఆధారంగా ఆర్టీసీలో విభజన జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. జిల్లాల వారీగా విభజించి ఈ మేరకు వివరాలను విజయవాడ బస్సు భవన్‌కు ఇప్పటికే పంపారు. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో అధికారికంగా విభజన ప్రకటన ఎప్పుడు వెలువడుతుందా? అని 3501 మంది ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సహజంగా ఆర్టీసీలో ఏళ్ల తరబడి ఒకే డిపో పరిధిలో పనిచేస్తున్న వారే అధికం.

అదీ కూడా తమ సొంత ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో జిల్లాల పునర్విభజన తరువాత ఏ డిపోలో పనిచేస్తున్న ఉద్యోగులను అక్కడే కొనసాగిస్తారా?, లేక అటూ, ఇటూ మార్చుతారా? అనేది ఎప్పటికి తేలుస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. డిపో మేనేజర్లను ఎప్పటి మాదిరిగానే  కొనసాగే అవకాశ ముంది. రీజియన్‌ వ్యవస్థ కాకుండా మూడు జిల్లాలకు ముగ్గురు జిల్లా మేనేజర్లను నియమిస్తారని భావిస్తున్నారు. డిపోల విభజన సహా అన్ని అంశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

ఉన్నతాధికారుల ఆదేశాలు రావాల్సి ఉంది 
డిపోల విభజన, ఉద్యోగుల సర్దుబాటు వంటి అంశాలపై ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. డిపోల స్థాయిలో కసరత్తు పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదించాం. ఉద్యోగుల విభజన పెద్దగా ఉండదనే అంటున్నారు. ఏ డిపో పరిధిలో వారు ఆ డిపోలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. 
– నాగేశ్వరరావు, ఆర్‌ఎం, రాజమహేంద్రవరం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top