జయలలిత సాధించారు.. బాబు వల్ల కాలేదు: తలారి రంగయ్య | Ex MP Talari Rangaiah Serious Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

జయలలిత సాధించారు.. బాబు వల్ల కాలేదు: తలారి రంగయ్య

Oct 12 2026 12:27 PM | Updated on Oct 12 2026 12:39 PM

Ex MP Talari Rangaiah Serious Comments On Chandrababu

సాక్షి, అనంతపురం: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించలేదో ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్‌ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంటులో చట్టం ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.

మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నాయకులు తలారి రంగయ్య తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వెనుకబడిన వర్గాలను టీడీపీ కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు తప్పులను ఎత్తిచూపినప్పుడు గతంలో నీలం సంజీవరెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వంటి నాయకులు రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. అనేక అంశాల్లో సుప్రీంకోర్టు నుంచి విమర్శలు ఎదురైనా చంద్రబాబు నైతిక బాధ్యత వహించడం లేదని ఆరోపించారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేంద్రంతో పోరాడి బీసీ రిజర్వేషన్లు సాధించారని, చంద్రబాబు కూడా అదే విధంగా ఎందుకు ప్రయత్నించడం లేదని ప్రశ్నించారు. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిటీ నివేదిక రిజర్వేషన్ల కల్పనకు ఉపయోగపడేలా లేదని అభిప్రాయపడ్డారు. రాజకీయ వెనుకబాటుతనానికి సంబంధించి స్పష్టమైన గణాంకాలు సమర్పించి ఉంటే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కేవని పేర్కొన్నారు. బీసీలను మభ్యపెట్టడం తప్ప టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. బీసీలకు అత్యధిక పదవులు కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌దే. వైఎస్సార్‌సీపీ కంటే ఎక్కువగా బీసీలకు పదవులు ఇచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇదీ చదవండి: ఏపీ మున్సిపల్‌ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement