‘ఆహార’ ఉత్పత్తులకు ­ఊతం | Sakshi
Sakshi News home page

‘ఆహార’ ఉత్పత్తులకు ­ఊతం

Published Wed, Nov 15 2023 5:32 AM

Establishment of 32 tradition food clusters in AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆత్రేయపురం పూతరేకులు..తాపేశ్వరం మడత కాజా..కాకినాడ గొట్టం కాజా..కండ్రిక పాలకోవా..నగరం గరాచీ..అనకాపల్లి బెల్లం..మాడుగుల హల్వా..గువ్వలచెరువు పాలకోవా, బందరు తొక్కుడు లడ్డు..నన్నారీ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకు వెళ్లినా స్థానికంగా పేరొందిన ఎన్నో సంప్రదాయ ఆహార ఉత్పత్తులున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన ఈ ఆంధ్ర వంటకాలకు దశల వారీగా భౌగోళిక గుర్తింపు తీసుకురావడం, ప్రతీ ఉత్పత్తికి ప్రత్యేక బ్రాండింగ్‌తో అంతర్జాతీయ మార్కెటింగ్, తద్వారా వీటిì తయారీపై ఆధారపడిన వారికి మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

సంప్రదాయ ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటివరకు తిరుపతిలడ్డూతో పాటు బందరు తొక్కుడు లడ్డు, గుంటూరు సన్నమిరప కాయ, బంగినపల్లి మామిడికి మాత్రమే భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్‌) లభించింది. వందల కోట్ల టర్నోవర్‌ ఉన్నప్పటికీ మిగిలిన వాటికి తగిన ప్రోత్సాహం లేక గుర్తింపునకు నోచుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అంతరించిపోతున్న సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది.

ప్రైమ్‌ మినిస్టర్‌ ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజస్‌ (పీఎంఎఫ్‌ఎంఈ) కింద 60:40 శాతం నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఈ తరహా ఆహార ఉత్పత్తులను తయారు చేసే ప్రాంతాలను కలుపుతూ 32 ట్రెడిషన్‌ ఫుడ్‌ క్లస్టర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 

35 శాతం సబ్సిడీపై రుణాలు 
ఒక్కో క్లస్టర్‌ పరిధిలో 50–100కి పైగా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరికి తమ వ్యాపార అవసరాల కోసం అవసరమైన పెట్టుబడిని సమకూరుస్తారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల స్థాయికి వీటిని తీర్చిదిద్దేందుకు వీలుగా రూ.కోటి వరకు ఆర్థికసాయం అందజేస్తారు.

ఈ మొత్తంలో 35% సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. ఆధునిక సాంకేతిక టవైపు అడుగులు వేసే విధంగా వీరికి అవసరమైన తోడ్పాటునిస్తారు. వృత్తి నైపుణ్యతలో నూతన సాంకేతికత పద్ధతులపై శిక్షణ కూడా ఇస్తారు. తయారు చేసుకున్న ఆహార ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్‌ కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతనిస్తారు.  

రూ.10 కోట్లతో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన 
ఆహార ఉత్పత్తుల తయారీలో అదనపు విలువను చేకూర్చడమే లక్ష్యంగా ఇంక్యూబేషన్‌ సెంటర్స్‌ నిర్మిస్తారు. సరుకులు నిల్వ చేసుకునేందుకు వీలుగా స్థానికంగా గోదాములు, కోల్డ్‌ రూమ్స్‌ వంటి వాటి నిర్మాణానికి ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్‌ కింద రూ.10 కోట్ల వరకు ఆహార తయారీ ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో)కు లేదా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతనిస్తారు.

ప్యాకేజ్‌ డిజైనింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్‌తో పాటు రవాణ, నిల్వ ఖర్చులు, ఎడ్వర్‌టైజ్‌మెంట్, ట్రేడ్‌మార్క్‌ కాపీ రైట్, జీఐ ట్యాగ్‌ గుర్తింపు కోసం అయ్యే ఖర్చుల్లో కూడా 50% గ్రాంట్‌ రూపంలో సమకూరుస్తారు. మిగిలిన 50% ఆయా తయారీదారులు సొంతంగా సమకూర్చుకోవచ్చు లేని పక్షంలో దాన్ని రుణంగా అందిస్తారు. దీంట్లో గరిష్టంగా రూ.3 కోట్ల వరకు సబ్సీడీ ఇస్తారు.

ప్రత్యేక బ్రాండింగ్‌తో రిటైల్‌ మార్కెట్‌లోకి 
ఉత్పత్తుల వారీగా ప్రత్యేక బ్రాండింగ్‌తో మార్కెట్‌లోకి తీసుకురావడమే కాదు బహుళ జాతి సంస్థలకు చెందిన రిటైల్‌ అవుట్‌ లెట్స్‌ అమ్మకాలకూ చేయూతనిస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఆన్‌లైన్‌ అమ్మకాలకు శ్రీకారం చుడతారు. తొలిదశలో మాడుగుల హల్వాను జనవరి నుంచి ప్రత్యేక బ్రాండింగ్‌తో జనవరి నుంచి రిటైల్‌ మార్కెట్‌లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా ఇటీవలే దామోదరం సంజీవయ్య లా వర్సిటీతో  ఏపీ  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ ఎంవోయూ చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆత్రేయపురం పూతరేకులకూ జీఐ ట్యాగ్‌ వచ్చింది. అదే రీతిలో త్వరలో మాడుగుల హల్వాకు జీఐ ట్యాగ్‌ తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఉత్పత్తులకు కూడా జీఐ ట్యాగ్‌ తీసుకురానున్నారు. 

మాడుగుల హల్వాకు చేయూత 
1890లో మా పూర్వికులు తయారు చేసిన మాడుగుల హల్వాకు ప్రభుత్వం చేయూతనిస్తుండడం ఆనందంగా ఉంది. ఏటా రూ.24 కోట్లకుపైగా టర్నోవర్‌ జరుగుతున్న మాడుగుల హల్వాకు జీఐ ట్యాగ్‌తో పాటు ప్రత్యేక బ్రాండింగ్‌తో రిటైల్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇస్తోన్న సహకారం మరువ లేనిది. వరల్డ్‌ ఫుడ్‌ ఇండియా–2023లో మాడుగుల హల్వా స్టాల్‌కు అనూహ్య స్పందన లభించింది. కేంద్రమంత్రితో సహా వివిధ రాష్ట్రాల ప్రముఖులు హల్వా రుచిచూశారు. – దంగేటి మోహన్, మాడుగుల హల్వా సృష్టికర్త మునిమనవడు 

ఆహార ఉత్పత్తులకు పూర్వవైభవం 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌లో 32 ట్రెడిషన్‌ ఫుడ్‌ క్లస్టర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి పరిధిలో గుర్తించిన ఆహార ఉత్పత్తుల తయారీదారులకు అవసరమైన ఆరి్థక చేయూతను అందజేయనుంది. దీంతో పాటు వాటికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగింగ్‌), బ్రాండింగ్, మార్కెటింగ్‌ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.  – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ 

Advertisement
 
Advertisement
 
Advertisement