కేసులు వేసే అధికారం ఈఓ, ఏసీలకు..

EO And AC For Endowment Lands Power To File Case - Sakshi

సాక్షి, అమరావతి: దేవుడి భూములు, ఆలయాల ఇతర ఆస్తులను ఆక్రమించుకునే వారిపై కోర్టుల్లో క్రిమినల్‌ కేసులు నమోదు చేసే అధికారాన్ని సంబంధిత ఆలయ ఈఓ లేదా జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్లకు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలంటే దేవదాయ శాఖ చట్టంలోని 86(3) సెక్షన్‌ ప్రకారం సంబంధిత ఆలయ ఈఓలు దేవదాయ శాఖ కమిషనర్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఈ అధికారాన్ని సంబంధిత ఆలయ ఈఓ లేదా జిల్లా దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్లకు బదలాయిస్తూ దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేవుడి భూములు, ఇతర ఆస్తుల ఆక్రమణదారులపై ఎటువంటి జాప్యం లేకుండా స్థానిక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. దేవదాయశాఖ పరిధిలో వివిధ ఆలయాల పేరిట దాదాపు 4.09 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో అందులో 67,525 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. మరో 3,613 ఎకరాలను వాటి లీజు గడువు ముగిసినా సంబంధిత లీజుదారులు వాటిని తమ అధీనంలో ఉంచుకున్నారు.

ట్రస్టు బోర్డులకుదరఖాస్తుల స్వీకరణ అధికారం
ఇక 6 (ఏ), (బీ) కేటగిరి ఆలయాల్లో ట్రస్టు బోర్డుల నియామకానికి నోటిఫికేషన్‌ జారీచేయడం, ట్రస్టు బోర్డు సభ్యుల నియామకానికి దరఖాస్తుల స్వీకరణ అధికారం ఇప్పటివరకు దేవదాయ శాఖ కమిషనర్‌కే ఉంది. తాజాగా.. 6 (ఏ) కేటగిరీ ఆలయాలకు నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ అధికారం దేవదాయ శాఖ డివిజనల్‌ కమిషనర్లకు. 6 (బీ) ఆలయాల అధికారం జిల్లా దేవదాయ శాఖ కమిషనర్లకు బదలాయిస్తున్నట్లు కూడా వాణీమోహన్‌ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top