ఏపీలో ఉపాధి కూలి పెంపు రూ.5 మాత్రమే | Employment wage hike in AP is only Rs 5 | Sakshi
Sakshi News home page

ఏపీలో ఉపాధి కూలి పెంపు రూ.5 మాత్రమే

Jul 2 2026 5:03 AM | Updated on Jul 2 2026 5:03 AM

Employment wage hike in AP is only Rs 5

9 రాష్ట్రాల్లో రూ.44 నుంచి రూ.66 చొప్పున పెంపు

వీబీ జీ రామ్‌ జీ పథకంలో రోజు కూలి రేట్లను ప్రకటించిన కేంద్రం 

కేరళలో రూ.32 కర్ణాటకలో రూ.12 పెంపు

గత జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఉపాధి కూలి రేటు రూ.89 వరకు పెరుగుదల 

చంద్రబాబు ప్రభుత్వంలో ఈ రెండేళ్లలో పెరిగింది రూ.12 మాత్రమే

సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకుగాను కూలీలకు ఇచ్చే రోజువారీ కూలి రేటును ఏపీలో కేంద్రం తక్కువగా పెంచింది. వికసిత్‌భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌–గ్రామీణ (వీబీ జీ రామ్‌ జీ) పథకంలో కూలీలకు రాష్ట్రాల వారీగా చెల్లించే కూలి రేట్లను బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది.  దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో రూ.44 నుంచి రూ.66 చొప్పున రోజువారీ కూలి రేటును పెంచిన కేంద్రం, మన రాష్ట్రంలో ఐదు రూపాయిలు మాత్రమే పెంచింది. 

ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో రాష్ట్రంలో కూలీలకు రోజువారీ చెల్లించే గరిష్ట కూలి రూ.307. ఇప్పుడు వీబీ జీ రామ్‌ జీ పథకంలో ఈ కూలి రేటును రూ.312కు పెంచారు. ఇదే సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా రూ.66కు పెంచారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోను రూ.44 నుంచి రూ.61 మధ్య వేతన రేటు పెంచటం గమనార్హం. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్‌ సెక్రటరీ రోహిణి ఆర్‌.భాజిభాకరే పేరిట గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. పెంచిన వేతన రేట్లు బుధవారం (జూలై 1) నుంచే అమల్లోకి వస్తాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

ఎక్కువ కూలి ఉన్న రాష్ట్రాల్లో మరింత ఎక్కువ పెరుగుదల
దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో ఇప్పటికే ఉన్న రూ.369 రోజువారీ గరిష్ట కూలిని.. ఇప్పుడు రూ.32 పెంచి రూ.401 చేశారు. కర్ణాటకలో ఇప్పటికే రూ.370 ఉన్న కూలిని రూ.12 పెంచి.. రూ.382 చేశారు. తమిళనాడులో రూ.336 ఉన్న కూలిని రూ.తొమ్మిది పెంచి.. రూ.345 చేశారు. 

అప్పుడు ఐదేళ్లలో రూ.89 పెరుగుదల,  గత రెండేళ్లలో పెరిగింది రూ.12 మాత్రమే 
రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ఉపాధి కూలి రేటు రూ.89 పెరిగింది. 2024 మార్చి వరకు రూ.272 ఉన్న కూలిని 2024 ఏప్రిల్‌ నుంచి రూ.28 పెంచి.. రూ.300 చేశారు. 2020 మార్చి నెలాఖరున మన రాష్ట్రంలో ఉన్న ఉపాధి కూలి రూ.211 కాగా.. 2024 ఏప్రిల్‌ నాటికి ఇది రూ.300కు పెరిగింది. మరోవైపు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గత రెండేళ్లలో ఈ కూలి పెరిగింది రూ.12 మాత్రమే. రాష్ట్రంలో ఏటా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే దాదాపు 47 లక్షలకుపైగా పేదకుటుంబాలు వ్యవసాయపనులు లేని సమయంలో ఈ పథకం పనుల మీద ఆధారపడి జీవిస్తుంటాయి.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement