breaking news
Labor wages
-
ఏపీలో ఉపాధి కూలి పెంపు రూ.5 మాత్రమే
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ప్రభుత్వం కల్పించే ఉపాధి పనులకుగాను కూలీలకు ఇచ్చే రోజువారీ కూలి రేటును ఏపీలో కేంద్రం తక్కువగా పెంచింది. వికసిత్భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ (వీబీ జీ రామ్ జీ) పథకంలో కూలీలకు రాష్ట్రాల వారీగా చెల్లించే కూలి రేట్లను బుధవారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. దేశంలో తొమ్మిది రాష్ట్రాల్లో రూ.44 నుంచి రూ.66 చొప్పున రోజువారీ కూలి రేటును పెంచిన కేంద్రం, మన రాష్ట్రంలో ఐదు రూపాయిలు మాత్రమే పెంచింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో రాష్ట్రంలో కూలీలకు రోజువారీ చెల్లించే గరిష్ట కూలి రూ.307. ఇప్పుడు వీబీ జీ రామ్ జీ పథకంలో ఈ కూలి రేటును రూ.312కు పెంచారు. ఇదే సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యధికంగా రూ.66కు పెంచారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, జార్ఖండ్, అస్సాం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోను రూ.44 నుంచి రూ.61 మధ్య వేతన రేటు పెంచటం గమనార్హం. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ జాయింట్ సెక్రటరీ రోహిణి ఆర్.భాజిభాకరే పేరిట గెజిట్ నోటిఫికేషన్ జారీ అయింది. పెంచిన వేతన రేట్లు బుధవారం (జూలై 1) నుంచే అమల్లోకి వస్తాయని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.ఎక్కువ కూలి ఉన్న రాష్ట్రాల్లో మరింత ఎక్కువ పెరుగుదలదక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో ఇప్పటికే ఉన్న రూ.369 రోజువారీ గరిష్ట కూలిని.. ఇప్పుడు రూ.32 పెంచి రూ.401 చేశారు. కర్ణాటకలో ఇప్పటికే రూ.370 ఉన్న కూలిని రూ.12 పెంచి.. రూ.382 చేశారు. తమిళనాడులో రూ.336 ఉన్న కూలిని రూ.తొమ్మిది పెంచి.. రూ.345 చేశారు. అప్పుడు ఐదేళ్లలో రూ.89 పెరుగుదల, గత రెండేళ్లలో పెరిగింది రూ.12 మాత్రమే రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య ఉపాధి కూలి రేటు రూ.89 పెరిగింది. 2024 మార్చి వరకు రూ.272 ఉన్న కూలిని 2024 ఏప్రిల్ నుంచి రూ.28 పెంచి.. రూ.300 చేశారు. 2020 మార్చి నెలాఖరున మన రాష్ట్రంలో ఉన్న ఉపాధి కూలి రూ.211 కాగా.. 2024 ఏప్రిల్ నాటికి ఇది రూ.300కు పెరిగింది. మరోవైపు ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గత రెండేళ్లలో ఈ కూలి పెరిగింది రూ.12 మాత్రమే. రాష్ట్రంలో ఏటా గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉండే దాదాపు 47 లక్షలకుపైగా పేదకుటుంబాలు వ్యవసాయపనులు లేని సమయంలో ఈ పథకం పనుల మీద ఆధారపడి జీవిస్తుంటాయి. -
ఆర్టీసీ కార్మికులకు అందని వేతనాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కార్మికుల వేతనాల చెల్లింపుల్లో మరోసారి తీవ్ర జాప్యం జరగడం కలకలం సృష్టిస్తోంది. చేతిలో డబ్బులు లేక, ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీ.. సిబ్బందికి వేతనాలివ్వడం కష్టంగా మారింది. కొంతకాలంగా నాలుగైదు రోజులు ఆలస్యంగా కార్మికులకు వేతనాలు చెల్లిస్తోంది. ఈ నెల ఒకటో తేదీన వేతనాలు అందాల్సి ఉన్నా.. గురువారం రాత్రి వరకు కూడా అందకపోవడంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో గుర్తింపు కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్లు శుక్రవారం ధర్నాలకు పిలుపునిచ్చాయి. అన్ని బస్ డిపోలు, బస్ భవన్ ఎదుట భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించాలని ఆయా సంఘాల నేతలు అశ్వత్థామరెడ్డి, ధామస్‌రెడ్డి, రాజిరెడ్డి, బాబు, హనుమంతు, సుధాకర్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రంలోగా వేతనాలు అందకుంటే శనివారం నుంచి బస్సులు తిప్పేది లేదని హెచ్చరించారు. కార్మికుల వేతనాలు తక్షణమే చెల్లించాలని యాజమాన్యాన్ని నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బస్సుల నిర్వహణ, ఇతర ఖర్చులకు సరిపడా ఆదాయం లేకపోవడంతో కార్మికుల భవిష్యనిధి నుంచి దాదాపు రూ.500 కోట్లు, పరపతి సహకార సంఘం నుంచి రూ.250 కోట్లు, పదవీ విరమణ బెనిఫిట్, కార్మికులు మృతి చెందితే సాయం ఇచ్చే నిధి నుంచి కూడా ఆర్టీసీ సొంతానికి డబ్బులు వాడుకుంది. వీటిని చెల్లించాలని కార్మిక సంఘాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందకపోవడంతో యాజమాన్యం చేతులెత్తేసింది. గత పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పూర్తిగా చెల్లించకపోవడంతో ఆగ్రహంగా ఉన్న కార్మికులు.. తాజాగా వేతనాల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తడంతో మరింత మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోలు కోసం రూ.35 కోట్లు విడుదల చేస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
నెలలుగా ‘ఉపాధి’ కూలీలకు అందని వేతనాలు
మంచిర్యాల రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు నెలల తరబడి వేతనాలు అందడం లేదు. అధికారులు వారికి డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. నెలలు గడుస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా జిల్లాలోని లక్షలాది మంది కూలీలు తమ శ్రమ ఫలం కోసం ఎదురు చూస్తున్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరంతోపాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనిచేసిన కూలీలకు యంత్రాంగం డబ్బులు చెల్లించలేదు. జిల్లాలో 31,619 శ్రమశక్తి సంఘాలు ఉండగా, 5,80,577 మంది కూలీలు ఉన్నారు. రెగ్యులర్‌గా పనిచేస్తున్న 3,92,598 మంది కూలీలకు రూ.13.30 కోట్లు బకాయిలు ఉన్నారు. ఫలితంగా కూలీలు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. సాకులతో కాలం వెళ్లదీత ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసే కూలీలకు ప్రతీ వారం కూలీ డబ్బులు చెల్లించాలి. ఒకవేళ ఆలస్యమైన గరిష్టంగా 14 రోజుల్లో వేతనాలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ జిల్లాలో పనిచేస్తున్న కూలీలకు నెలలు గడుస్తున్నా వేతనాలు అందడం లేదు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలు, కొత్త బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల నిధులు రావడం ఆలస్యమైందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) అధికారులు చెబుతున్నా, వచ్చిన నిధులు బయోమెట్రిక్ విధానం ద్వారా అందించడంలో తాత్సారం చేస్తున్నారు. కూలీల వేతనాల చెల్లింపులు జిల్లాలోని 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంకు, 34 మండలాల్లో పోస్టాఫీసు ద్వారా చేపడుతున్నారు. తాము నిధులు విడుదల చేసినా, యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసు వారు చెల్లింపులు ఆలస్యం చేస్తున్నారని, దీని వల్ల తమకు ఎలాంటి సమాచారం అందడం లేదని, చెల్లింపులు విషయమై తమకు సంబంధం లేదన్న సాకుతో డ్వామా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బయోమెట్రిక్ కష్టాలు ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు అందించే వేతనాల ప్రక్రియ ఆన్లైన్ ద్వారా సాగుతుంది. వేతనాల పంపిణీలో అక్రమాలను అరికట్టాలని, వేతనాలు నేరుగా కూలీలకే అందేలా బయోమెట్రిక్ ద్వారా వేతనాలను అందించేందుకు యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసు ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇందుకోసం గ్రామపంచాయతీల్లో సీఎస్పీలను నియమించి కూలీల నుంచి వేలిముద్రలు సేకరించారు. సామాజిక పింఛన్లను వీరే బయోమెట్రిక్ ద్వారా ఇస్తున్నారు. ఇప్పటికే కూలీలు, పింఛన్‌దారుల వేలి ముద్రలు సేకరించి, వారికి బ్యాంకు ఖాతాలు తెరిచారు. డబ్బులు పంపిణీ చేసే సమయంలో వేలి ముద్రలు తీసుకోవాల్సి ఉండడంతో, వేలి ముద్రలు సరిగా పడడం లేదని వేతనాలు సీఎస్పీలు అందించడం లేదు. మరికొందరు కూలీల బ్యాంకు ఖాతాలు లేవని, కూలీలు జాబ్‌కార్డులను గ్రామంలో పిలిచే పేర్లతోనే తీసుకోవడం, ఆధార్ కార్డులోని పేర్లు, కూలీల జాబ్ కార్డుల్లోని పేర్లలో తేడాలు ఉండడం వల్ల వేతనాలు చెల్లించడం ఇబ్బందిగా ఉందన్న కారణాలతో కూలీలకు డబ్బులు చెల్లించడం లేదు. పింఛన్ల పంపిణీ కూడా వీరే చేపట్టడంతో, గ్రామాల్లోని కూలీలకు వేతనాలు ఇవ్వకుండా పింఛన్లను మాత్రమే పంపిణీ చేస్తున్నారని, అడిగితే తాము బ్యాంకు నుంచి కొద్ది మొత్తంలోనే డబ్బులు డ్రా చేశామని సీఎస్పీలు సమాధానం చెబుతున్నట్లు కూలీలు పేర్కొంటున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అక్రమాలు అరికట్టడం ఏమోగాని, కూలీలకు వేతనాలు అందక అప్పుల పాలవుతున్నారు. నిధులున్నా అందని వేతనాలు జిల్లాలోని కూలీలకు వేతనాలు అందించేందుకు యాక్సిస్ బ్యాంకుకు రూ.6.80 కోట్లు, పోస్టాఫీసుకు రూ.4 కోట్లు, 2013-14 పెండింగ్ వేతనాలు యాక్సి స్ బ్యాంకుకు రూ.2.45 కోట్లను ఆయా సంస్థలకు ఈ నెల మొదటి తేదీనే చెల్లించారు. కానీ, ఇప్పటి వరకు ఆయా సంస్థలు కూలీలకు వేతనాలు అందించడం తాత్సారం చేస్తున్నాయి. దీంతో మంగళవారం డ్వామా అధికారులు యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసు అధికారులతో సమావేశాన్ని నిర్వహించినా వేతనాలను మాత్రం వీరు కూలీలకు అందించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పక్షం రోజుల్లో చెల్లింపులు - గణేష్ జాదవ్, డ్వామా పీడీ ఎన్నికలు, నూతన బడ్జెట్ల కేటాయింపు వల్ల నిధుల విడుదల కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం కూలీలకు చెల్లించే రూ.13.30 కోట్ల బకాయిలను యాక్సిస్ బ్యాంకు, పోస్టాఫీసులకు గత వారమే అందించాం. కానీ, ఇప్పటి వరకు వారు చెల్లింపులు చేపట్టలేదు. 15 రోజుల్లోగా కూలీలందరికి వేతనాలు అందించాలని ఆయా సంస్థలను ఆదేశించాం. వేతనాలు ఇవ్వకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించాం. కూలీలందరికి వేతనాలు అందుతాయి.


