‘ఉపాధి’ కూలీల వేతనం ఏపీలోనే ఎక్కువ | Employment Guarantee Scheme works to rural poor even in corona times | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ కూలీల వేతనం ఏపీలోనే ఎక్కువ

Oct 18 2020 3:02 AM | Updated on Oct 18 2020 8:02 AM

Employment Guarantee Scheme works to rural poor even in corona times - Sakshi

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం పనులు దేశమంతటా జరుగుతున్నాయి.. కానీ, మన రాష్ట్రంలో ఈ పథకంలో పనిచేసే కూలీలకు ఒకరు ఒక రోజుకు పనిచేసినందుకు దేశంలోనే అత్యధికంగా సరాసరిన రూ.229.72 చొప్పున కూలి చెల్లిస్తున్నారు. ఈ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకుంటున్న పది పెద్ద రాష్ట్రాల్లో కూలీకి రోజుకు రూ.164ల నుంచి రూ.200ల మధ్య వేతనాలు దక్కుతుండటం గమనార్హం. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే రోజు వారీ చేసిన పనికి కూలీగా కనిష్టంగా రూ.30ల చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.630 కోట్లు అదనపు లబ్ధి పొందినట్టు అధికారులు చెబుతున్నారు. 

► కూలీలు రోజు వారీ చేసిన పని మొత్తానికి ప్రభుత్వం నిర్ధారించిన ధరల ప్రకారం విలువ కట్టి, దానిని ఆ పని చేసిన కూలీలకు సమంగా పంచే ప్రక్రియ రాష్ట్రంలో అమలు అవుతోంది. ఈ ప్రకారం మన రాష్టంలో కూలీలు రోజుకు సరాసరి రూ.229.72 చొప్పున ప్రయోజనం పొందుతున్నారు.  
► తమిళనాడులో సగటున రోజుకు దక్కుతున్న కూలీ రూ.188.81. తెలంగాణలో రూ.165.55లే. రాష్ట్రంలో శ్రమశక్తి సంఘాల విధానంలో పని కల్పించడంతో ఎక్కువ కూలీదక్కడానికి వీలు పడుతోంది. ఉపాధి సిబ్బంది, సంఘాల సభ్యుల సమావేశాల్లో సమస్యలు చర్చించుకోవడం వల్ల ఈ పథకాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు. వలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందినీ ఈ పథకంలో భాగస్వాములను చేయడంతో కూలీలకు వారి ఇంటికి సమీపంలోనే పని కల్పించేందుకు దోహదపడుతోంది. కరోనా పరిస్థితుల్లోనూ వేతనాన్ని వెంటనే చెల్లించటంతో కూలీలు పనులు చేయడానికి ఆసక్తి చూపారు.

కరోనా సమయంలో మా పచారీ కొట్టు మూసివేయాల్సి వచ్చింది. చెన్నైలో ఒక ప్రైవేట్‌ కంపెనీలో చేస్తున్న మా అమ్మాయి ఉద్యోగమూ పోయింది. ఈ సమయంలో ఇద్దరం ఊళ్లోనే ఉపాధి పనులకు వెళ్లాం. ఏ వారం చేసిన పనికి డబ్బులు ఆ వారమే బ్యాంకులో పడ్డాయి. ఒక్కొక్కరికి రూ.పది వేల పైనే వచ్చాయి.
– మద్దాల లక్ష్మీ, మేడేపల్లి, వేలేరుపల్లి మండలం, ప.గోదావరి 

మా అరటికాయల వ్యాపారం లాక్‌డౌన్‌ వల్ల ఆగిపోయింది. ఆ సమయంలో భార్య, పాపతో కలిసి ఉపాధి పనులకు వెళ్లాం. ఆ డబ్బులకు మరికొంత కలిపి రెండు ఆవులు కొన్నాం. లాక్‌డౌన్‌ ఎత్తేశాక మళ్లీ అరటికాయలు అమ్ముతున్నా.
    – లోచెర్ల రామారావు, బొండపల్లి, గరివిడి మండలం, విజయనగరం జిల్లా   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement