హేలాపురి..కురుల సిరి 

Eluru Is The Name Given To The Human Hair Industry - Sakshi

ఏలూరు (టూటౌన్‌): హ్యూమన్‌ హెయిర్‌ ఇండస్ట్రీకి పెట్టింది పేరు ఏలూరు. ఒకప్పుడు నగరం, పరిసర గ్రామాల్లో కుటీర పరిశ్రమగా విరాజిల్లింది. ఇళ్ల వద్ద మహిళలు జుట్టును శుభ్రం చేసి, ఆరబెట్టి, చిక్కులను తీసి సాఫ్‌ చేసిన అనంతరం గ్రేడింగ్‌ చేసేవారు. ఇందుకు కంపెనీ ప్రతినిధులు కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు చెల్లించేవారు. ఇలా వేలాది మంది మహిళలు ఉపాధి పొందేవారు. ఏలూరు నగర పరిధిలోని తూర్పువీధి, కట్టేపు వీధి, ఆముదాల అప్పలస్వామి కాలనీ, వంగాయగూడెం, ఏలూరు రూరల్‌ మండల పరిధిలోని మాదేపల్లి, చాటపర్రు, వెంకటాపురం తదితర గ్రామాల్లో మహిళలు ఇళ్ల వద్ద జట్టును శుభ్రం చేసే పనిలో ఉండేవారు. 20 ఏళ్ల క్రితం దాదాపు 5 వేల మందికి పైగా కార్మికులు ఇలా ఉపాధి పొందేవారు. అలాగే పది వరకు జట్టు కంపెనీల్లో నెలవారీ జీతానికి వందలాది మంది కార్మికులు పనిచేసేవారు. ఈ ప్రాంతంలో జట్టు ఉపాధి మార్గంగా ఉండేది.  

అంతర్జాతీయ ఖ్యాతి 
ఏలూరు జట్టుకు అంతర్జాతీయంగా గిరాకీ ఉండేది. జుట్టు నాణ్యతతో పాటు ధర అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. గతంలో కోట్లాది రూపా యల వ్యాపారం కూడా జరిగేది. దక్షిణ భారత జుట్టు ఎగుమతిదారుల సంఘ ప్రతినిధుల్లో ఏలూరుకు చెందిన వారు సైతం ఉండేవారు. ఏలూరుకు చెందిన మడిపల్లి మోహనగుప్తా వంటి వారు ఈ పరిశ్రమలో పేరు గడించారు. ఇప్పటికీ ఈయన ఆధ్వర్యంలో పరిశ్రమ నడుస్తోంది. ఏలూరులో గ్రేడింగ్‌ చేసిన జు ట్టును దేశ, విదేశాలకు ఎగుమతి చేసేవారు. జపాన్, చైనా, యూరప్‌ దేశాల ప్రతినిధులు ఇక్కడకు వచ్చి జుట్టు గ్రేడింగ్, శుభ్రం చేయడం, ప్యాకింగ్‌ వంటి పనులను స్వయంగా పరిశీలించేవారు. భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చేవారు.  

ఆలయాల వేలం పాటల్లో..  
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో నిర్వహించే తలనీలాల వేలం పాటలకు ఏలూరు ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా వెళ్లేవారు. 70 శాతం మంది ఈ ప్రాంత వ్యాపారులే ఉండేవారు. తిరుమల తిరుపతి, అన్నవరం, ద్వారకాతిరుమల, శ్రీశైలం వంటి క్షేత్రాల్లో భక్తులు సమర్పించిన తలనీలాలను ఏలూరు తీసుకువచ్చి ఇక్కడ శుభ్రం చేయించేవారు. ఇలా శుభ్రం చేసిన జట్టును ఆయా వ్యాపారుల ప్రతినిధులు వచ్చి తీసుకువెళ్లేవారు.  

ప్రస్తుతం పరిమితంగా..  
గతంలో వేలాది మందికి ఉపాధి చూపిన వెంట్రుకల పరిశ్రమ ప్రస్తుతం రెండు, మూడు సంస్థలకే పరిమితమైంది. కార్మికుల సంఖ్య వందల్లోకి తగ్గింది. గతంలో పాలకుల ప్రోత్సాహం లేకపోవడం, జట్టు కొనుగోలులో పోటీ పెరగడం, సరైన మార్కెటింగ్‌ సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల వద్ద జట్టు శుభ్రం చేసే పనులు తగ్గిపోయాయి. కొద్ది కంపెనీలు మాత్రమే ఈ పనులు చేస్తున్నాయి.  

గత వైభవం తీసుకురావాలి 
ఏలూరులో వెంట్రుకల పరిశ్రమకు గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పలువురు కోరుతున్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందని అంటున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top