breaking news
hair industry
-
హేలాపురి..కురుల సిరి
ఏలూరు (టూటౌన్): హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీకి పెట్టింది పేరు ఏలూరు. ఒకప్పుడు నగరం, పరిసర గ్రామాల్లో కుటీర పరిశ్రమగా విరాజిల్లింది. ఇళ్ల వద్ద మహిళలు జుట్టును శుభ్రం చేసి, ఆరబెట్టి, చిక్కులను తీసి సాఫ్ చేసిన అనంతరం గ్రేడింగ్ చేసేవారు. ఇందుకు కంపెనీ ప్రతినిధులు కిలోకు రూ.150 నుంచి రూ.200 వరకు చెల్లించేవారు. ఇలా వేలాది మంది మహిళలు ఉపాధి పొందేవారు. ఏలూరు నగర పరిధిలోని తూర్పువీధి, కట్టేపు వీధి, ఆముదాల అప్పలస్వామి కాలనీ, వంగాయగూడెం, ఏలూరు రూరల్ మండల పరిధిలోని మాదేపల్లి, చాటపర్రు, వెంకటాపురం తదితర గ్రామాల్లో మహిళలు ఇళ్ల వద్ద జట్టును శుభ్రం చేసే పనిలో ఉండేవారు. 20 ఏళ్ల క్రితం దాదాపు 5 వేల మందికి పైగా కార్మికులు ఇలా ఉపాధి పొందేవారు. అలాగే పది వరకు జట్టు కంపెనీల్లో నెలవారీ జీతానికి వందలాది మంది కార్మికులు పనిచేసేవారు. ఈ ప్రాంతంలో జట్టు ఉపాధి మార్గంగా ఉండేది. అంతర్జాతీయ ఖ్యాతి ఏలూరు జట్టుకు అంతర్జాతీయంగా గిరాకీ ఉండేది. జుట్టు నాణ్యతతో పాటు ధర అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. గతంలో కోట్లాది రూపా యల వ్యాపారం కూడా జరిగేది. దక్షిణ భారత జుట్టు ఎగుమతిదారుల సంఘ ప్రతినిధుల్లో ఏలూరుకు చెందిన వారు సైతం ఉండేవారు. ఏలూరుకు చెందిన మడిపల్లి మోహనగుప్తా వంటి వారు ఈ పరిశ్రమలో పేరు గడించారు. ఇప్పటికీ ఈయన ఆధ్వర్యంలో పరిశ్రమ నడుస్తోంది. ఏలూరులో గ్రేడింగ్ చేసిన జు ట్టును దేశ, విదేశాలకు ఎగుమతి చేసేవారు. జపాన్, చైనా, యూరప్ దేశాల ప్రతినిధులు ఇక్కడకు వచ్చి జుట్టు గ్రేడింగ్, శుభ్రం చేయడం, ప్యాకింగ్ వంటి పనులను స్వయంగా పరిశీలించేవారు. భారీ ఎత్తున ఆర్డర్లు ఇచ్చేవారు. ఆలయాల వేలం పాటల్లో.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో నిర్వహించే తలనీలాల వేలం పాటలకు ఏలూరు ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా వెళ్లేవారు. 70 శాతం మంది ఈ ప్రాంత వ్యాపారులే ఉండేవారు. తిరుమల తిరుపతి, అన్నవరం, ద్వారకాతిరుమల, శ్రీశైలం వంటి క్షేత్రాల్లో భక్తులు సమర్పించిన తలనీలాలను ఏలూరు తీసుకువచ్చి ఇక్కడ శుభ్రం చేయించేవారు. ఇలా శుభ్రం చేసిన జట్టును ఆయా వ్యాపారుల ప్రతినిధులు వచ్చి తీసుకువెళ్లేవారు. ప్రస్తుతం పరిమితంగా.. గతంలో వేలాది మందికి ఉపాధి చూపిన వెంట్రుకల పరిశ్రమ ప్రస్తుతం రెండు, మూడు సంస్థలకే పరిమితమైంది. కార్మికుల సంఖ్య వందల్లోకి తగ్గింది. గతంలో పాలకుల ప్రోత్సాహం లేకపోవడం, జట్టు కొనుగోలులో పోటీ పెరగడం, సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ఇళ్ల వద్ద జట్టు శుభ్రం చేసే పనులు తగ్గిపోయాయి. కొద్ది కంపెనీలు మాత్రమే ఈ పనులు చేస్తున్నాయి. గత వైభవం తీసుకురావాలి ఏలూరులో వెంట్రుకల పరిశ్రమకు గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు కృషిచేయాలని పలువురు కోరుతున్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. -
కేశాల పరిశ్రమకు కష్టకాలం
అంతర్జాతీయ మార్కెట్కు నిలిచిన ఎగుమతులు భారీగా పతనమవుతున్న ధరలు పుణ్యక్షేత్రాల్లో తలనీలాల వేలం పాటకు స్పందన శూన్యం తణుకు/ద్వారకాతిరుమల: నల్ల బంగారంగా పేరొందిన తలనీలాల(కేశాల) ధర తలకిందులైంది. గతేడాదితో పోలిస్తే మార్కెట్లో కేశాలకు డిమాండ్ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం వల్ల ధర పతనమవుతోంది. దీంతో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కేశాల వేలం పాటకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. తలనీలాల ఎగుమతిలో పశ్చిమ గోదావరి జిల్లా అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందింది. జిల్లాలో గతేడాది తలనీలాల ఎగుమతిలో రూ.వెయ్యి కోట్ల టర్నోవర్ జరగ్గా ఈ ఏడాది అందులో 50 శాతం కూడా దాటే అవకాశాలు కనిపించడం లేదు. కేశాలకు ధర లేకపోవడానికి ప్రధాన కారణం భారత్ నుంచి చైనాకు ఎగుమతులు లేకపోవడమే. కేశాల కొనుగోళ్లను చైనా పూర్తిగా నిలిపివేసిందని, అందుకే నిల్వలు పెరిగి ధర పతనమైందని వ్యాపారులు చెబుతున్నారు. ఏడాది క్రితం రూ.కోటికి అమ్ముడైన స్పెషల్ గ్రేడ్ సరుకు ప్రస్తుతం మార్కెట్లో కేవలం రూ.25 లక్షలు పలుకుతోంది. సాధారణంగా తలనీలాలను పుణ్యక్షేత్రాల్లో కేశఖండనశాలల నుంచి సేకరిస్తుంటారు. వీటిని శుభ్రపర్చి గ్రేడ్లుగా విభజించి చైనా, అమెరికా, యూరప్, ఆఫ్రికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. కేవలం ఐదు శాతం మాత్రం ఇలా పుణ్యక్షేత్రాల నుంచి సేకరిస్తుండగా మిగిలినదంతా ఇళ్ల నుంచి సేకరిస్తారు. ఇళ్లనుంచి కేశాలను సేకరించే చిన్న వర్తకులపై ఇటీవలి కాలంలో సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతుండడంతో ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోంది. పన్ను పేరుతో అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి విజ్ఞప్తి చేశాం ‘‘యూరప్ దేశాల్లో ఆర్థిక మాంద్యం కారణంగా తలనీలాల ఎగుమతులు క్షీణించాయి. చిరు వ్యాపారులపై సేల్ ట్యాక్స్ పేరుతో అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంటింటికీ తిరిగి కేశాలను సేకరించే చిన్న వర్తకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సేల్ ట్యాక్స్ అధికారుల తీరుపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇదే పరిస్థితి కొనసాగితే కేశాల పరిశ్రమల్లో పనిచేసే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు’’ - వంక రవీంద్రనాథ్, ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ అధినేత, తణుకు