ఏలూరులో ఏసీబీ సోదాలు.. టౌన్‌ ప్లానింగ్‌ లో రికార్డుల తనిఖీ

Eluru: Anti Corruption Bureau Raids Town Planning Office - Sakshi

రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహిస్తాం

ఏసీబీ డీఎస్పీ పీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ వెల్లడి 

ఏలూరు టౌన్‌: ఏలూరు నగరపాలక సంస్థ టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో ఏసీబీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. ఏలూరులో భవన నిర్మాణాలకు అనుమతులు, అపార్టుమెంట్లలో అనుమతులకు విరుద్ధంగా పెంట్‌హౌస్‌ల నిర్మాణం, ప్లాన్‌ల అనుమతులకు విరుద్ధంగా భవనాల నిర్మాణాలు సాగుతున్నాయనే ఫిర్యాదులతో ఏసీబీ రంగంలోకి దిగింది.


రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల కార్యాలయాల్లోని టౌన్‌ప్లానింగ్‌ విభాగాలను గురువారం ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూ రు జిల్లా ఏసీబీ డీఎస్పీ పీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు ఎన్‌వీ భాస్కరరావు, కె.నాగేంద్రప్రసాద్, సిబ్బంది రికార్డులు తనిఖీ చేశారు. ఉదయం 10.30 గంటల నుంచి గత కొన్నేళ్లుగా ఉన్న రికార్డులన్నీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాయంత్రం 8.30 గంటల వరకు తనిఖీలు కొనసాగాయి.

శుక్రవారం కూడా సోదాలు ఉంటాయని డీఎస్పీ స్పష్టం చేశారు. భవన నిర్మాణ అనుమతుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా అవకతవకలు జరిగినట్టు తనిఖీల్లో గుర్తిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని, అవినీతి, అవకతవకలు చోటుచేసుకుంటే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే సోదాలు చేపట్టామని, ప్రత్యేకమైన కారణాలు ఏమీ లేవని ఏసీబీ డీఎస్పీ పేర్కొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top