
విజయవాడ ధర్నా చౌక్‌లో చేపట్టిన మహాధర్నాకు భారీ ఎత్తున హాజరైన విద్యుత్ ఉద్యోగులు
చలో విజయవాడకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన సిబ్బంది
ధర్నా చౌక్ వద్ద మహాధర్నా
ప్రభుత్వం, యాజమాన్యం మొండి వైఖరిని వీడాలని డిమాండ్
లేదంటే రేపట్నుంచి సమ్మె అనివార్యమని హెచ్చరిక
ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లకు తిరస్కారం
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం, విద్యుత్ సంస్థల మొండివైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో భారీ ధర్నా చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ పేరుతో నిర్వహించిన మహాధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది ఉద్యోగులు తరలివచ్చారు. డిమాండ్ల సాధనకై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) గత నెల 15 నుంచి వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి స్పష్టమైన హామీ రాలేదు.
దీంతో సోమవారం విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 20 వేల మందికి పైగా శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు, తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా లెక్కచేయకుండా ముందు రోజు రాత్రే దూర ప్రాంతాల నుంచి ఏ వాహనం దొరికితే అందులో విజయవాడకు వచ్చారు.
చర్చలు విఫలం.. సమ్మె తప్పదు
విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉద్యోగుల జేఏసీని చర్చలకు పిలిచాయి. సోమవారం సాయంత్రం రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రధాన డిమాండ్లను విద్యుత్ యాజమాన్యం తిరస్కరించింది. దీంతో మంగళవారం ‘వర్క్ టు రూల్’, బుధవారం నుంచి నిరవధిక సమ్మె జరుగుతాయని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఎస్.కృష్ణయ్య స్పష్టం చేశారు. చర్చల అనంతరం జేఏసీ నేతలు కె.శ్రీనివాస్, ఎంవీ గోపాలరావు, ఎంవీ రాఘవరెడ్డి, కేవీ శేషారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, ఏపీ జెన్‌కో ఎండీతో కూడిన అధికారుల బృందం చర్చలు జరిపింది.
జేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లలో కొన్నిటికి మాత్రమే వారు సానుకూలత వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయడం, బకాయిలు చెల్లించడం, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడం, జూనియర్ లైన్‌మెన్ గ్రేడ్–2 (ఎనర్జీ అసిస్టెంటు)లకు విద్యుత్ సంస్థల్లో అమలులో ఉన్న పాత సర్విసు నిబంధనలు వర్తింపజేయడం వంటి ప్రధాన డిమాండ్లను కమిటీ తిరస్కరించింది. ఫలితంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి’ అని కృష్ణయ్య తెలిపారు. ఉద్యోగులు దాదాపు 59 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిలో ఆఖరి ప్రాధాన్యతగా పొందుపరిచిన వాటిలో మొక్కుబడిగా కొన్నింటికి యాజమాన్యం అంగీకరించింది.
ఈ మేరకు సోమవారం రాత్రి పలు ఆదేశాలను జారీ చేసింది. వాటి ప్రకారం.. కారుణ్య నియామకాలను చేపట్టేటప్పుడు 16 ఏళ్ల లోపు ఉన్నవారిని, 45 దాటిన వారిని అనర్హులుగా పరిగణిస్తారు. అయితే ఈ వయసు తక్కువ, ఎక్కువ (అండర్ ఏజ్, ఓవర్ ఏజ్) ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ నాటికి దరఖాస్తు చేసిన వారికి మాత్రమేనని మెలిక పెట్టింది. ఉద్యోగ సంఘాలతో పీరియాడికల్ నెగోషియేషన్ కమిటీ (పీఎన్‌సీ) సమావేశం ప్రతి మూడు నెలలకు జరపడానికి ఒప్పుకుంది.
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంస్థ అవసరాలకు అడ్వాన్స్‌గా తీసుకునే నగదును రూ.2 వేల నుంచి రూ.5 వేలకు పెంచింది. సర్వీస్ ఇంక్రిమెంట్ల క్రమబద్ధీకరణకు ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. పీఆర్సీ 2022పై ఇంజినీర్స్ అసోసియేషన్లు వేసిన కోర్టు పిటిషన్లను ఉపసంహరింపజేస్తామని హామీ ఇచ్చింది. కాగా కొన్ని డిమాండ్లకు అంగీకరించామని చెప్పుకునేందుకు ప్రభుత్వం ఈ ఎత్తుగడ వేసిందని విద్యుత్ జేఏసీ మండిపడింది.