రైతులకు విద్యుత్‌ ఎప్పటికీ ఉచితమే

Electricity Is Always Free For Farmers By andhra Pradesh Government - Sakshi

ఒక్క కనెక్షన్‌ కూడా తొలగించం

కేబినెట్‌ చర్చలో మంత్రులతో సీఎం వైఎస్‌ జగన్‌

ఉచిత విద్యుత్‌ పథకం – నగదు బదిలీకి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం

పథకం పరిధిలోకి రాని కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తాం

కనెక్షన్‌ ఉన్న రైతు పేరు మీద ప్రత్యేక ఖాతా.. అందులోకే డబ్బు జమ

వాటిని డిస్కంలకు చెల్లించనున్న రైతు

మీటర్ల ఖర్చు.. డిస్కంలు, ప్రభుత్వానిదే

ప్రస్తుత సంస్కరణల వల్ల రైతుపై ఒక్కపైసా భారం ఉండదు

తద్వారా బాధ్యత, జవాబుదారీతనం 

30–35 ఏళ్లపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఢోకా లేకుండా చర్యలు

చంద్రబాబు పెట్టిన రూ.8 వేల కోట్ల ఉచిత విద్యుత్‌ బకాయిలు చెల్లించాం 

రూ.1,700 కోట్లతో ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేసి.. నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నాం

సాక్షి, అమరావతి: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తామని హామీ ఇచ్చి, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ హామీ అమలు ఫైలుపై తొలి సంతకం చేసిన ఘనత దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. అప్పటి వరకు రైతులకున్న విద్యుత్‌ చార్జీల బకాయిలు రూ.1,100 కోట్లను కూడా మాఫీ చేశారన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ‘ఉచిత విద్యుత్‌– నగదు బదిలీ’ అంశంపై జరిగిన చర్చలో సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రులతో చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.  

దివంగత మహానేత వైఎస్‌
రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకాన్ని.. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నీరుగార్చాయి. టీడీపీ సర్కార్‌ హయాంలో పగటి పూట 9 గంటల పాటు కరెంటు ఇచ్చే పరిస్థితులే లేవు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు పరిశీలిస్తే.. దాదాపు 40 శాతం ఫీడర్లలో పగటి పూట 9 గంటలు కరెంటు ఇవ్వడానికి మౌలిక సదుపాయాలే లేవు. ఈ పరిస్థితులను మార్చడానికి, ఫీడర్ల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌ పనుల కోసం రూ.1,700 కోట్లు కేటాయించాం. దీని వల్ల ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో 89 శాతం ఫీడర్లలో పగటిపూటే 9 గంటలపాటు ఉచితంగా విద్యుత్‌ ఇస్తున్నాం. మిగిలిన చోట్ల కూడా వేగంగా పనులు పూర్తి చేసి రబీ నాటికి పూర్తి స్థాయిలో 9 గంటలపాటు పగటి పూటే కరెంటు ఇస్తాం. 2019 మార్చి 31 నాటికి చంద్రబాబు ఉచిత విద్యుత్‌ పథకం కింద డిస్కంలకు డబ్బులు ఇవ్వకుండా దాదాపు రూ.8 వేల కోట్లు బకాయిపెట్టారు. మనం అధికారంలోకి వచ్చాక ఆ డబ్బు మొత్తం చెల్లించాం. ఈ డబ్బులు కట్టడమే కాకుండా నాణ్యమైన కరెంటు ఇవ్వడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకున్నాం. 
   
స్థిరంగా నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌  
► రైతుల విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే 30 నుంచి 35 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్‌ పథకానికి ఎలాంటి ఢోకా రానివ్వకుండా 10 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించాం. 

► తద్వారా యూనిట్‌ కరెంటు రూ.2.5 కే ప్రభుత్వానికి వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం. దీని వల్ల ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఉచిత విద్యుత్‌ పథకం స్థిరంగా, నిరంతరాయంగా కొనసాగడానికి ఇది దోహదం చేస్తుంది. రైతుల కోసమే ఈ సోలార్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నాం. 
 
రైతులపై ఒక్క పైసా భారం పడదు 
► కొత్తగా తీసుకొస్తున్న సంస్కరణల వల్ల ఉచిత విద్యుత్‌ రూపేణా ఎంత వాడుతున్నాం.. ఎంత ఖర్చు చేస్తున్నామో తెలుస్తుంది. ప్రభుత్వం ప్రత్యేక ఖాతాల్లోకి వేసే డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారు.

► నాణ్యమైన కరెంట్‌ పగటి పూట 9 గంటల పాటు రాకపోతే రైతులు డిస్కంలను నిలదీయొచ్చు. సంబంధిత అధికారులను ప్రశ్నించవచ్చు. దీని వల్ల జవాబుదారీతనం, బాధ్యత పెరుగుతాయి. అధికారులకు కూడా రైతుల పట్ల జవాబుదారీతనం పెరుగుతుంది. దీని వల్ల చంద్రబాబు ప్రభుత్వంలా బకాయి పెట్టే పరిస్థితులు ఉండవు. స్కీంను నిర్వీర్యం చేసే పరిస్థితులూ రావు.  

► ప్రతినెలా రైతులకు డబ్బులు పడతాయి. ఆ డబ్బులు డిస్కంలకు వెళతాయి. దీనివల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితులు కూడా బాగుంటాయి. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల్లో భాగంగా నాలుగు అంశాలను రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ఉచిత విద్యుత్‌ పథకంలో సంస్కరణలు ఒకటి. మనది మనసున్న, రైతుల పక్షపాత ప్రభుత్వం. రైతులకు ఒక్క పైసాకూడా నష్టం జరగదు.  
 
ఉచిత విద్యుత్‌పై పేటెంట్‌ మహానేతదే  
► రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం మీద ఎవరికైనా పేటెంట్‌ ఉందంటే.. అది మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిదే. అందుకనే దీనికి వైస్సార్‌ ఉచిత విద్యుత్‌ పథకంగా పేరు పెడుతున్నాం. 

► మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతులను ఆదుకునే విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం మరో రెండు, మూడు అడుగులు ముందుకు వేస్తున్నాం. ఆయన ప్రవేశపెట్టిన పథకాలను మరింత మెరుగ్గా ప్రజలకు అందిస్తున్నాం. ఫీజు రియింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాం. 
 
ఆ డబ్బును బ్యాంకులు మినహాయించుకోవు 
► విద్యుత్‌ శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కాల్‌ సెంటర్‌ కూడా పెడతాం. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటారు. రైతులు ఎన్ని యూనిట్లు కాలిస్తే.. అన్ని యూనిట్లకూ ప్రభుత్వం డబ్బు ఇస్తుంది.  

► ఉచిత విద్యుత్‌ పథకం కింద ప్రభుత్వం బదిలీ చేసే నగదును బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ మినహాయించుకోలేవు. మీటర్లకయ్యే ఖర్చును డిస్కంలు, ప్రభుత్వం భరిస్తాయి. రైతులకు ఎలాంటి భారం ఉండదు.  

► ఏడాదికి దాదాపు రూ.8 వేల కోట్లకుపైగా ఉచిత విద్యుత్‌ కోసం ఖర్చు అవుతుంది. దీనికయ్యే పూర్తి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి ఏటా ఒక్కో రైతుకు దాదాపు రూ.49,600కు పైగా ఉచిత విద్యుత్‌ కింద ఖర్చు అవుతుంది.  

► ఉచిత విద్యుత్‌ పథకంలో సంస్కరణలు, దీనిపై వచ్చే సందేహాలకు పూర్తి స్థాయిలో సమాధానాలు ఇస్తూ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించాం. గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన సమాచారం ఉంచాలని చెప్పాం. ఈ పథకాన్ని శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుంది.  

► రైతులకు ఇప్పుడున్న కనెక్షన్లలో ఒక్కటి కూడా తొలగించం. రైతులకు ఎవరికైనా వర్తించకపోతే వారి కనెక్షన్లను రెగ్యులరైజ్‌ చేస్తాం. ఒక్క కనెక్షన్‌ కూడా రద్దవుతుందన్న మాట రాకూడదని అధికారులకు చాలా స్పష్టంగా  చెప్పాం. మనం మేనిఫెస్టోలో 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ పగటి పూట ఇస్తామని హామీ ఇచ్చాం. ఆ మాటను అక్షరాల అమలు చేస్తాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top