
కోర్టుల్లో మూడు కేసులు విచారణలో ఉన్నా లెక్కచేయని ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ
నోటిఫికేషన్ ఇవ్వకుండానే ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఎన్నికల నిర్వహణ
ఎన్నికలను ఆపాలని కోర్టును ఆశ్రయించిన ఆస్కార్‌రావు
సూర్యనారాయణకే వత్తాసు పలికిన కూటమి ప్రభుత్వం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో రెండు గ్రూపుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. కూటమి ప్రభుత్వం అండదండలతో సూర్యనారాయణ ఇష్టానుసారం చెలరేగిపోతుండగా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదేనని ఆస్కార్‌రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. కోర్టులో మూడు కేసులున్నా లెక్క చేయకుండా సూర్యనారాయణ ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో నిబంధనలు పక్కనపెట్టి ఎన్నికలు నిర్వహించేసుకోవడం గమనార్హం.
ఏడాది నుంచి రగడ
ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమదంటే తమదని ఏడాది నుంచి సూర్యనారాయణ, ఆస్కార్‌రావు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. సూర్యనారాయణ గత ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తను మరిపించేలా కూటమి గెలుపు కోసం పని చేశారు. ఏడాది కిందట ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఉన్న సూర్యనారాయణ, ఆస్కార్‌రావు మధ్య విభేదాలు వచ్చాయి. ఆస్కార్‌రావును సంఘం నుంచి తొలగిస్తున్నట్లు కొద్ది నెలల కిందట సూర్యనారాయణ ప్రకటించారు. తనను తొలగించే అధికారం సూర్యనారాయణకు లేదని, అసలు ఆ సంఘం తమదేనని ఆస్కార్‌రావు న్యాయ పోరాటానికి దిగారు. ఈ నెల 3వ తేదీతో సంఘం రాష్ట్ర కార్యవర్గం గడువు ముగిసింది. కోర్టులో విచారణ జరుగుతుండగానే కొత్తగా ఎన్నికలు పెట్టడానికి సూర్యనారాయణ సన్నాహాలు మొదలుపెట్టారు.
సమావేశం ముసుగులో ఎన్నికలు
సూర్యనారాయణ వర్గానికి మండల స్థాయిలో కమిటీల నిర్మాణం లేదు. అందువల్ల ఆయన ప్రభుత్వ మద్దతుతో ఉద్యోగులను సమీకరించి ఎన్నికలకు సిద్ధమయ్యారు. గురువారం విజయవాడలో సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నామని, దానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని ప్రచారం చేశారు. తన పలుకుబడి ఉపయోగించి ఈ సమావేశానికి హాజరయ్యేందుకు వీలుగా గురువారం ఉద్యోగులకు ప్రత్యేక సెలవు ఇస్తూ ప్రభుత్వంతో ఉత్త్వులు జారీ చేయించారు. తద్వారా ఉద్యోగులను రప్పించి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
దీనిపై ఆస్కార్‌రావు వర్గం కోర్టును ఆశ్రయించింది. స్టేట్ కౌన్సిల్ మీటింగ్ ముసుగులో సూర్యనారాయణ ఎన్నికలు నిర్వహిస్తున్నారని, నోటిఫికేషన్ లేకుండా, కింది స్థాయిలో ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు జరుపుతున్నారని, దాన్ని ఆపాలని హైకోర్టులో ఒకటి, మచిలీపట్నం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. మచిలీపట్నం కోర్టులో దీనిపై బుధవారం విచారణ జరిగి, గురువారానికి వాయిదా పడింది. గురువారం సాయంత్రం కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, ఉదయమే సూర్యనారాయణ కోర్టులను కూడా లెక్క చేయకుండా విజయవాడలోని ఒక కన్వెన్షన్ సెంటర్‌లో ఎన్నికలు నిర్వహించి తాను అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు.
ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తల హాజరు?
ఈ సమావేశం కోసం ప్రతి జిల్లాకు ఐదు బస్సులు పెట్టి ఉద్యోగులను రప్పించారు. కొన్ని జిల్లాల నుంచి ఉద్యోగుల పేరుతో టీడీపీ కార్యకర్తలను బస్సులు ఎక్కించినట్లు తెలుస్తోంది. సూర్యనారాయణపై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లోనూ ఆయన అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్స్ సర్టిఫికెట్లను బదిలీలకు అనుమతించవద్దని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ ఉత్తర్వులివ్వడం విశేషం. ఇన్ని ఆరోపణలున్నా, అక్రమాలకు పాల్పడుతున్నా కూటమి ప్రభుత్వం సూర్యనారాయణకు మద్దతిచ్చి ఆయన అక్రమంగా నిర్వహించిన ఎన్నికలకు సహకరించడంపై ఉద్యోగవర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.