అభ్యర్థి చనిపోతే ఎన్నిక వాయిదా

Election postponed if candidate deceased - Sakshi

సాక్షి, అమరావతి: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసి, పరిశీలనలో ఆ నామినేషన్‌ సక్రమమే అని నిర్ధారణ జరిగిన తర్వాత అభ్యర్ధి మరణించిన పక్షంలో ఆ మున్సిపల్‌ వార్డు/ కార్పొరేషన్‌ డివిజన్‌లో ఎన్నిక వాయిదా వేసేందుకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ వద్ద ప్రత్యేక ఎన్నికల గుర్తును పొందిన రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీ అభర్థి మరణించినా ఎన్నిక వాయిదా వేయవచ్చునని తెలిపింది. మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలలో భాగంగా గతంలో జరిగిన  నామినేషన్‌ దాఖలు ప్రక్రియకు, తాజాగా ఇప్పటి ఎన్నికల ప్రక్రియకు మధ్య దాదాపుగా ఏడాది అంతరం ఏర్పడింది. ఈ ఏడాది సమయంలో కొన్నిచోట్ల పోటీలో ఉన్న అభ్యర్థులు మరణించారు.

ఈ నేపథ్యంలో ఉత్పన్నమైన సందేహాలపై వివరణ ఇస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి కన్నబాబు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థి మరణించినప్పుడు రిటర్నింగ్‌ అధికారి ఎలా వ్యవహరించాలో తెలియజేయడంతో పాటు, నామినేషన్ల ఉపసంహరణ నిబంధనలను వెల్లడించారు. అభ్యర్థులు చనిపోయినటువంటి ప్రత్యేక పరిస్థితులలో రిటర్నింగ్‌ అధికారి.. స్పష్టమైన ఆధార సహిత వివరాలు సేకరించిన తర్వాతనే ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. వాయిదా వేస్తే ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలని సూచించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top